అయోధ్యకు పోటెత్తిన భక్తులు, తొలిరోజే 5 లక్షల మందికి దర్శనాలు

అయోధ్యకు పోటెత్తిన భక్తులు, తొలిరోజే 5 లక్షల మందికి దర్శనాలు
అయోధ్యకు భక్తకోటి పోటెత్తుతోంది. లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్య బాలక్ రామ్ దర్శనానికి తరలివస్తున్నారు. ప్రాణప్రతిష్ట తర్వాతి రోజు నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం ఇవ్వడంతో.. రామభక్తులు భారీగా వస్తున్నారు. 13 కిలోమీటర్ల పొడవైన రామ్ పథ్ మొత్తం భక్తులతో నిండిపోయింది. ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిన భక్తులతో కనిపిస్తున్నాయి. అయోధ్య ఆలయానికి దారి తీసే మార్గాలే కాదు.. పట్టణ వీధులన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో భక్తులే కనిపిస్తున్నారు. మొదటిరోజు సాధుసంతులు, ప్రముఖులు, ఆహ్వానితులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వగా.. రెండో రోజు సామాన్య  ఏకంగా 5 లక్షల మంది బాలక్ రామ్ ను దర్శించుకున్నారు.
అయితే రద్దీని అదుపుచేసే క్రమంలో భద్రతా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎక్కడికక్కడ రద్దీని కట్టడి చేసే లక్ష్యంతో భక్తులను పోలీసులు అడ్డుకోవాల్సి వస్తోంది. పలుచోట్ల భక్తులను నియంత్రించే ఉద్దేశ్యంతో.. లాఠీచార్జీ చేయాల్సి వస్తోంది. పలుచోట్ల తోపులాటకు దారి తీస్తోంది. దాదాపు 8 వేల మందితో భద్రతను ఏర్పాటు చేసినా.. ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో స్వయంగా సీఎం యోగీ ఆదిత్యనాథే రంగంలోకి దిగాల్సి వచ్చింది. భక్తుల రద్దీని సమీక్షించారు. ఎట్టిపరిస్థితుల్లో భక్తులపై లాఠీచార్జీ చేయాడానికి వీళ్లేదని ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం రోజులో రెండు విడతల్లో బాలరాముడి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు తొలి దశ దర్శనం ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు.. బాల రాముడిని దర్శించుకోవచ్చని తెలిపింది. అయితే భక్తుల రద్దీ పెరగడం.. రానున్న రోజుల్లో ఈ రద్దీ తగ్గే అవకాశం లేకపోవడంతో.. స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని ఆలయ ట్రస్ట్ యోచిస్తోంది. దర్శన వేళలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఇటు భక్తులకు అయోధ్య ఆలయ ట్రస్ట్ కూడా రకరకాలుగా విజ్ఞప్తులు చేస్తోంది. అయోధ్యకు తరలివచ్చే భక్తులందరికీ బాలరాముడి దర్శనం అవుతుందని.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది.
ఇక ప్రతీ రోజు మధ్యాహ్నం అయోధ్య బాల రామునికి బోగ్‌ అందించనున్నారు. అలాగే ప్రతి గంటకు పాలు, పండ్లు నివేదిస్తున్నారు. మరోవైపు.. బాలక్ రామ్ కు వారంలో రోజుకో రకమైన వస్త్రాలను ధరింపజేయనున్నట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్ రంగు, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు దుస్తులను కట్టించనున్నట్లు పేర్కొన్నారు. ఇక ప్రత్యేకమైన రోజుల్లో బాల రాముడికి పసుపు రంగు దుస్తులు ధరింపజేయనున్నట్లు చెప్పారు. అలాగే నిత్యం స్వామివారికి 6 సార్లు హారతి ఇవ్వనున్నారు. దీనికి హాజరయ్యేందుకు భక్తులకు ఉచితంగా పాస్‌లు జారీ చేస్తారు.