హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం

`తెలంగాణ సెంటిమెంట్’ ప్రయోగించి పదేళ్ళపాటు అధికారంలో కొనసాగగలిగిన బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు పార్టీ పేరును టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ గా మార్చగానే చతికలపడాల్సి వచ్చింది. జాతీయ పార్టీ పేరుతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఆశలకు ఆదిలోనే గండం పడింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. 
 
తెలంగాణాలో రాజకీయ ఉనికి కోసం ఇప్పుడు కొత్త దారులు వెతుక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని, తాను పదవి నంది వైదొలిగిన నాలుగు నెలలకే రాష్ట్రంలో రైతుల బతుకులు ఛిద్రమై పోతున్నాయని అంటూ కేసీఆర్ `రైతు బాట’ పట్టి రైతుల మద్దతు సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సహితం ప్రతి రోజూ పొలాలకు వెళ్లి, రైతులను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. 
 
ఆయన కొడుకు కేటీఆర్ మరో అడుగు ముందుకేసి బిఆర్ఎస్ లేకపోతే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చివేస్తారంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు. తెలంగాణకు ఆయువుపట్టు హైదరాబాద్ నగరం కావడం, ఇక్కడి నుండి వచ్చే ఆదాయంతోనే మొత్తం తెలంగాణ అభివృద్ధి ఆధారపడి ఉండడంతో ఈ నినాదం రాష్ట్ర ప్రజలలో సరికొత్త సెంటిమెంట్ రగిలిస్తుంది ఆశపడుతున్నారు. 
 
  పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు బలమైన ప్రాతినిధ్యం లేకుంటే బీజేపీ, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తాయని హెచ్చరించారు. వచ్చే జూన్‌ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు నిండుతాయని, అప్పటి వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని గడువు తీరుతుందని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయటానికి కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. 
 
అలా జరగొద్దు అనుకుంటే.. బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌లో గట్టి బలం ఉండాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఓట్ల కోసం మన అవసరాలు తీరకుండానే గోదావరి జలాలను తమిళనాడు, కర్ణాటకకు తరలించేలా కావేరి నదితో అనుసంధానం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని అంటూ మరో ఆరోపణ చేశారు.
 
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జమ్మూ కాశ్మీర్ కు తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్ర హోదాను రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేయడంతో హైదరాబాద్ లో కూడా అదేవిధంగా చేస్తుందనే భయాలు ప్రజలలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ కు త్వరలోనే రాష్త్ర హోదా తిరిగి లభిస్తుందని ఈ మధ్యనే స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించిన విషయాన్నీ మరచినట్లున్నారు.
 
హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఆలోచనలపై పలు సందర్భాలలో మోదీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అటువంటి ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని పార్లమెంట్ ముఖంగా వెల్లడి చేసింది. అయినా ప్రజలలో భావోద్రేకాలు రెచ్చగొట్టేందుకు కేటీఆర్, ఇతర బిఆర్ఎస్ నేతలు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు.
 
తెలంగాణ ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో ఇప్పటి వరకు `ఆత్మపరిశీలన’ చేసుకోలేని బిఆర్ఎస్ నేతలు ఇంకా భావోద్రేకాలు రెచ్చగొట్టడం ద్వారానే పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి కీలకమైన కొలువులు, వనరులు, నీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజల ఆగ్రవేశాలకు గురయ్యామని గ్రహించే సాహసం చేయడం లేదు. పైగా, తమ ప్రభుత్వంలో జరిగిన తీవ్రమైన అవినీతి, అక్రమాల గురించి మరచిపోతున్నారు.