రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబిసిలకు రిజర్వేషన్లను రద్దు చేస్తానని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకరించినట్లు వచ్చిన `నకిలీ వీడియో’పై ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్ అమిత్ షా ‘టాంపర్డ్ స్పీచ్’ను పోస్ట్ చేసిందని ఆరోపిస్తూ బిజెపి శనివారం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత ఇది జరిగింది.
 
బిజెపి ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఈ ఫిర్యాదును చేస్తూ  కాంగ్రెస్ ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసి చర్య చేపట్టాలని రాష్ట్రంలోని ఎన్నికల సంఘం అధికారిని కోరింది. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా షా మాట్లాడినట్లుగా ముద్ర వేసేందుకు తెలంగాణలో ఎన్నికల ర్యాలీలో హోంమంత్రి చేసిన అసలు ప్రసంగాన్ని తారుమారు చేశారని బీజేపీ ఫిర్యాదులో పేర్కొంది.
 
“కేంద్ర హోం మంత్రి అమిత్ షా జీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా అలాంటి మాటలేవీ చెప్పలేదు. ఆంద్రప్రదేశ్‌తో పాటు భారతదేశం అంతటా రాబోయే ఎన్నికలలో బిజెపికి నష్టం కలిగించేందుకు అసలు ప్రసంగాన్ని తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం, వారికి తీరని నష్టం కలిగించేలా చేశారు” అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోలీస్‌కి కూడా పార్టీ ఇదే విధమైన ఫిర్యాదును సమర్పించింది. తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్ల తొలగింపుపై అమిత్ షా చర్చిస్తున్న వీడియోను లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోంమంత్రి ముస్లిం రిజర్వేషన్ల ముగింపు కోసం వాదిస్తున్నారని తప్పుడుగా చిత్రీకరించడానికి తారుమారు చేశారని బీజేపీ ఆరోపించింది.
 
కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ల అధికారిక హ్యాండిల్స్‌తో సహా వివిధ సోషల్ మీడియా ఖాతాలు ఎస్సి/ఎస్టీ రిజర్వేషన్‌లను రద్దు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు పేర్కొంటూ వీడియోను షేర్ చేశాయి. ‘మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చేసిన ఎన్నికల ప్రసంగం వైరల్‌గా మారింది’ అని జార్ఖండ్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
 
రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అమిత్ షా ఆరోపించారు. ‘‘రాహుల్ గాంధీ, కాంగ్రెస్ రిజర్వేషన్లపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. బుజ్జగింపుల కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు జామియా, ఏఎంయూ వంటి సంస్థల్లో ఎస్సీ-ఎస్టీ, ఓబీసీలను దూరం చేయడం ద్వారా రిజర్వేషన్లను అంతం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. బీజేపీ ఉన్నంత కాలం కాంగ్రెస్‌ రిజర్వేషన్‌ను కూడా ముట్టుకోలేదు. ఇది మోదీ గ్యారంటీ” అని అమిత్ షా వాస్తవానికి స్ఫష్టం చేశారు.