రాహుల్‌ గాంధీపై అస్సాం పోలీసులు కేసు నమోదు

* రాహుల్ భద్రతపై అమిత్ షాకు ఖర్గే లేఖ

భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఇటీవల అసోంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. ‘హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీస్‌ సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమైన కాంగ్రెస్‌ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు’ అని బిశ్వశర్మ ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.

కాంగ్రెస్‌ నేతల చర్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశామని గువాహటి పోలీస్‌ కమిషనర్‌ దిగంత బోరా చెప్పారు. ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ను నగరంలోని రద్దీ ప్రాంతాల్లో నిర్వహించవద్దని ఆదేశించినా కాంగ్రెస్‌ నేతలు పట్టించుకోలేదని, నిర్దేశిత మార్గాన్ని వదిలేసి నగరంలోపలికి వచ్చేందుకు ప్రయత్నించారని, నాయకుల తీరుతో కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసులపై దాడికి పాల్పడ్డారని, అందుకే వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కాంగ్రెస్‌ దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారని చెప్పారు.

అంతకుముందు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేలా సమూహాన్ని రాహుల్‌ గాంధీ రెచ్చగొట్టారని, ఆయనపై కేసు నమోదు చేయాలని డీజీపీ జీపీ సింగ్‌ను సీఎం ఆదేశించారు. రాహుల్ తో పాటు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ యువనేత కన్హయ్య కుమార్ లపైనా అసోం ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.

అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా సీఎం హిమంత బిశ్వ శర్మ, రాహుల్ గాంధీ మధ్య వాడీవేడి మాటల యుద్ధం జరిగింది. రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నాడని, అతడి యాత్ర నక్సల్ పంథాలో సాగుతోందని బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. ఇది అసోంకు ఏమంత క్షేమకరం కాదని హెచ్చరించారు. 

మరోవంక, అసోంలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, అనేక భద్రతా లోపాలు వెలుగుచూశాయని ఖర్గే వివరించారు. ఆ మేరకు అనేక ఘటనలను తన లేఖలో ప్రస్తావించారు.

ముఖ్యంగా, జనవరి 22న నాగావ్ జిల్లాలో రాహుల్ గాంధీ కాన్వాయ్ ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారని, వారు రాహుల్ గాంధీకి అత్యంత సమీపానికి వచ్చారని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఓ జాతీయ స్థాయి నేత కాన్వాయ్ లోకి ఇతరులు చొరబడి సమీపానికి రావడం అత్యంత అభద్రతతో కూడిన పరిస్థితి అని వివరించారు. ఇంత జరుగుతున్నా అసోం పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారని, కొన్నిసార్లు పోలీసులే దగ్గరుండి బిజెపి కార్యకర్తలను రాహుల్ కాన్వాయ్ లోకి పంపించారని ఖర్గే ఆరోపించారు. 

ఇప్పటివరకు అసోం పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు. రాహుల్ యాత్ర ముందుకు సాగేకొద్దీ ముప్పు అధికమవుతోందని, ఇకనైనా మీరు జోక్యం చేసుకోవాలని అమిత్ షాను కోరారు. రాహుల్ యాత్రకు తగిన భద్రత కల్పించేలా అసోం ముఖ్యమంత్రి, డీజీపీలకు దిశానిర్దేశం చేయాలని ఖర్గే తన లేఖలో విజ్ఞప్తి చేశారు.