‘‘కూటమికి `ఇండియా’ అనే పేరు పెట్టిందే నేను. కానీ కూటమి సమావేశాలకు నేను హాజరైన ప్రతీ సారి రాష్ట్రంలో మాకు వ్యతిరేకంగా ఉన్న సీపీఎం ఆ సమావేశాన్ని నియంత్రిస్తోంది. అది నన్ను అవమానించినట్లుగా అనిపిస్తుంది. సీపీఎం పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న 34 ఏళ్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాము. వారి సలహా పాటించే ప్రసక్తే లేదు’’ అని మమత బెనర్జీ స్పష్టం చేశారు.
సీట్ల పంపకానికి సంబంధించిన చర్చల్లో కాంగ్రెస్ తీరు సరిగ్గా లేదని మమత బెనర్జీ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్ సభ సీట్లలో 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని తాను ప్రతిపాదించానని ఆమె గుర్తు చేశారు. అయితే, తన ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకారం తెలపలేదని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తాము రాష్ట్రంలో ఉన్న అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు తాము ఇస్తామని చెప్పిన రెండు స్థానాల్లోనూ తామే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు.
బీజేపీ ని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా 23 విపక్ష పార్టీలు ఒక్కటై `ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కూటమిలో కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్లో అన్ని సీట్లలో తామే పోటీ చేస్తామని మమత విస్పష్టంగా ప్రకటించడం ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు `ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మమత ప్రకటనపై అప్రమత్తమైన కాంగ్రెస్ మమతా బెనర్జీ లేకుండా కూటమిని ఊహించలేమని స్పష్టం చేసింది. దీదీతో పొత్తు చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అయితే బెంగాల్‌లో కాంగ్రెస్ దీదీ సహకారం లేకుండా స్వతంత్రంగా పోటీ చేయాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అవకాశవాది అయిన మమతా బెనర్జీ పార్టీతో కలిసేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, పశ్చిమ బెంగాల్లో తామే అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని మమత ప్రకటించడానికి ముందు మమత బెనర్జీ తనకు, తన పార్టీకి ఎంతో దగ్గరి వారని రాహుల్ గాంధీ చెప్పారు. టీఎంసీతో సీట్ల పంపకంపై చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూ రెండు పార్టీలకు చెందిన రాష్ట్ర నాయకుల మాటలను పట్టించుకోవద్దని చెప్పిన కాసేపటికే, సీట్ల పంపకంపై కాంగ్రెస్ తో చర్చలు విఫలమయ్యాయని మమత ప్రకటించడం విశేషం. ఫలితాల తర్వాతే పొత్తులపై తుది నిర్ణయం ఉంటుందని దీదీ వెల్లడించారు.
కాగా, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర త్వరలో పశ్చిమ బెంగాల్ లో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో, ఆ యాత్రలో `ఇండియా’ కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పాల్గొంటుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ప్రశ్నించగా భారత్ జోడో న్యాయ యాత్ర పశ్చిమ బెంగాల్ లోకి వస్తోందన్న విషయమే తనకు తెలియదని, ఆ విషయం కాంగ్రెస్ నాయకులు తమకు తెలియజేయలేదని మమత సమాధానమిచ్చారు. అంటే, యాత్రలో తాము పాల్గొనబోవడం లేదని ఆమె పరోక్షంగా సమాధానమిచ్చారు.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం