రెజ్లర్ బజరంగ్‌ పూనియాపై సస్పెన్షన్‌ వేటు

రెజ్లర్‌ బజరంగ్‌పూనియాను నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజన్సీ (ఎన్‌ఎడిఎ) సస్పెన్షన్‌ వేటు వేసింది. దీంతో ఈ ఏడాది చివరలో జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై  సందిగ్ధత నెలకొంది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే    క్రీడాకారులకు దేశీయంగా ఎన్‌ఎడిఎ డోపింగ్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. 

మార్చి 10న సోనెపట్‌లో జరిగిన సెలక్షన్‌ ట్రయల్స్‌ కోసం డోపింగ్‌ టెస్ట్‌ కోసం మూత్ర నమూనాను ఇవ్వాలని బజరంగ్‌పూనియాను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు ఆయన నిరాకరించడంతో భవిష్యత్తులో జరిగే ఏ ఈవెంట్‌లలో పాల్గనకుండా సస్పెండ్‌ చేస్తూ ఎన్‌ఎడిఎ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 

సస్పెన్షన్‌తో టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్యపతకాన్ని సాధించిన పూనియా, ఈ నెలాఖరులో జరగనున్న సెలక్షన్‌ ట్రయల్స్‌కు దూరంకానున్నారు.  అయితే డోపింగ్‌ సేకరణ కిట్‌ గడువు ముగిసిందని కొన్ని నెలల క్రితం విడుదల చేసిన వీడియోలో బజరంగ్‌ పూనియా పేర్కొన్నారు.

అయితే ఈ సస్పెన్షన్‌ నోటీసు యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యుడబ్ల్యుడబ్ల్యు)లో గుర్తింపు పొందిన ఫెడరేషన్‌కు విరుద్ధంగా, డబ్ల్యుఎఫ్‌ఐ ప్రస్తుతం పనిచేయని, తాత్కాలిక అడహక్‌ కమిటీకి పంపడం గమనార్హం.

రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా బజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌లు ఢిల్లీలో ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే.