ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీస్

హాసన్ సెక్స్ రాకెట్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. ఈ విషయాన్ని కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జీ పరమేశ్వర ఆదివారం వెల్లడించారు. ఆయనను తిరిగి భారత్కు రప్పించేందుకు ఇంటర్పోల్ అధికారుల సాయం తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. 

ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇంటర్ పోల్ సమాచారం ఇచ్చి ఆయనను గుర్తిస్తుందని తెలిపారు. ప్రజ్వల్ను తిరిగి రప్పించే విషయాన్ని సిట్ చూసుకుంటుందని చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరును అభినందించిన పరమేశ్వర, సిట్ చట్ట ప్రకారం నడుచుకుంటుందని చెప్పారు.

ఒక నేరానికి సంబంధించి ఒక వ్యక్తి గుర్తింపు, ప్రదేశం లేదా కార్యకలాపాల గురించి తమ సభ్య దేశాల నుంచి అదనపు సమాచారం సేకరణకు అంతర్జాతీయ పోలీస్ సహకార సంస్థ బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేస్తుంటుంది. సెక్స్ కుంభకోణంపై దర్యాప్తునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రజ్వల్‌ను ఏవిధంగా వెనుకకు తీసుకురావాలో నిర్ణయిస్తుందని మంత్రి తెలియజేశారు.

‘ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది. ఇంటర్‌పోల్ అన్ని దేశాలకు సమాచారం అందజేసి, ఆయన ఎక్కడ ఉన్నదీ కనిపెడుతుంది’ అని చెప్పారు. సిట్ కృషిని పరమేశ్వర్ శ్లాఘిస్తూ, ఆ బృందం తమ బాధ్యత నిర్వహిస్తున్నదని, తాను అందుకున్న ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్య తీసుకున్నదని తెలిపారు.

మరోవైపు, ప్రజ్వల్ తిరిగివచ్చే అవకాశం ఉందని, బెంగళూరు, మంగళూరు, గోవాలో ఆయన దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది సిట్. సిట్ అదుపులో ఉన్న ప్రజ్వల్‌ తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్ డి రేవణ్ణను వైద్య పరీక్షల కోసం బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

అక్కడి నుంచి స్థానిక కోర్టుకు తరలించారు. ఒక అపహరణ కేసులో హెచ్‌డి రేవణ్ణను సిట్ శనివారం అరెస్టు చేసింది. జెడి (ఎస్) ఎంఎల్‌ఎ అయిన హెచ్‌డి రేవణ్ణ అత్యాచారం, కిడ్నాపింగ్ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.