ఓట్ల కోసం నిప్పుతో కాంగ్రెస్ చెల‌గాటం

ఓట్ల కోసం నిప్పుతో కాంగ్రెస్ చెల‌గాటం
ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేందుకు కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లింల మ‌ధ్య చీలిక తీసుకొచ్చి నిప్పుతో చెల‌గాట‌మాడుతోంద‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలో ప‌స లేద‌ని ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల్లో ప్ర‌యోజ‌నాల కోసం కాంగ్రెస్ నేత‌లు హిందూ, ముస్లింల మ‌ధ్య చిచ్చుపెడుతున్నార‌ని దుయ్య‌బ్ట‌టారు. 
 
మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టి అల్ల‌ర్లు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు.  మ‌త సామ‌రస్యాన్ని దెబ్బ‌తీసేందుకు కాంగ్రెస్ కుయుక్తులు ప‌న్నుతోంద‌ని ఓ వార్తాసంస్ధ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ముస్లింల‌ను కాంగ్రెస్ కేవ‌లం ఓటుబ్యాంక్‌గా ప‌రిగ‌ణిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. 
 
కేవ‌లం ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసేందుకే కాదు దేశాన్ని నిర్మించేందుకూ రాజ‌కీయాలను సాధ‌నంగా చేసుకోవ‌చ్చ‌ని కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న హిత‌వు ప‌లికారు. రాహుల్ గాంధీలో ఏమాత్రం ఫైర్ లేకున్నా, కాంగ్రెస్ పార్టీ మాత్రం నిప్పుతో చెల‌గాట‌మాడుతోంద‌ని ధ్వజమెత్తారు. ప్ర‌జ‌ల్లో భ‌యోత్పాతం సృష్టించేందుకు కాంగ్రెస్ హిందూ, ముస్లిం కార్డును ప్ర‌యోగిస్తోంద‌ని ఆరోపించారు. 
 
కులం, మ‌తం ఆధారంగా స‌మాజాన్ని విభ‌జించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్ నేత‌లు కోరుకుంటున్నార‌ని విమర్శించారు. అధికారంలోకి వ‌స్తే వార‌స‌త్వ ప‌న్ను విధించాల‌ని కాంగ్రెస్ యోచిస్తోంద‌ని ఆరోపించారు. అదే జ‌రిగితే దేశంలో ఆర్ధిక మాంద్యం త‌లెత్తుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 
 
అర్జెంటీనా, వెనిజులా దీన్ని అమ‌లుచేసి తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొన్న విష‌యం మ‌రువ‌రాద‌ని తెలిపారు.  ఇదే జ‌రిగితే భార‌త్ ప‌ట్ల పెట్టుబ‌డిదారుల విశ్వాసం స‌న్న‌గిల్లుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ 370 సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని ఎన్డీయే 400 స్ధానాల‌కుపైగా విజ‌యం సాధిస్తుంద‌ని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్య‌క్తం చేశారు.
 
తూర్పు లడఖ్ లో వాస్తవాధీనరేఖ వెంబడి చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతుందని చెబుతూ రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, పరిస్థితులు త్వరలో కుదుటపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా సరిహద్దువెంబటి భారత్ మౌలిక సదుపాయాలను భారత్ వేగంగా అభివృద్ధి చేస్తున్నదని చెబుతూ మన సరిహద్దులను భద్రంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
 
నాలుగేళ్లుగా రెండు బలమైన సైనిక శక్తుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోగలదా అని ప్రశ్నించగా ” ఆశాభావం లేకపోతే చర్చలు ఎందుకు జరుపుతాము?” అని రక్షణ మంత్రి ప్రశ్నించారు. చైనా సహితం అటువంటి ఆశతోనే ఉండడంతో చర్చలకు వస్తున్నదని తెలిపారు.