మెదక్ లోక్ సభ సీట్ కోసం కేసీఆర్ కుటుంభంలో కలహాలు!

మెదక్ లోక్ సభ సీట్ కోసం కేసీఆర్ కుటుంభంలో కలహాలు!
మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవటం ఇప్పుడు బిఆర్ఎస్ లో రాజకీయ దుమారం రేపుతోంది. పార్టీ మారేందుకే ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు ఆరోపణలు చెలరేగుతుండగా, కేసీఆర్ కుటుంభంలో మెదక్ లోక్ సభ సీటుకోసం తలెత్తిన కలహాలే అందుకు కారణం అంటూ బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు.
 
మెదక్ ఎంపీ సీటు విషయమై కేసీఆర్ కుటుంబంలో మనస్పర్థలు వచ్చినట్లు చెప్పారు. మెదక్ ఎంపీ సీటు కేటాయించాలని కేసీఆర్ కుమార్తె కవిత పట్టుబడుతున్నట్లు తెలిపారు. అందుకు కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ ఒప్పుకోవటం లేదని పేర్కొన్నారు.  ఈ విషయమై హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అందులో భాగంగానే హరీష్ అనుమతితోనే బీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని ఆరోపించారు.
మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమని చెప్పారు. దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ అధిష్ఠానం వారితో  బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని తెలిపారు.  సీఎం రేవంత్ రెడ్డిని కలవటంపై బీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాము తన నియోజకవర్గ సమస్యలు, ప్రోటోకాల్ విషయమై మాట్లాడేందుకే భేటీ అయినట్లు స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ ప్రధాని నరేంద్ర మోదీని ఏ విధంగానైతే కలిశారో, తాము కూడా ఎమ్మెల్యేలుగా ప్రజా సమస్యలపై చర్చించేందుకు కలిసినట్లు చెప్పారు.  తాము పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటూ అలాంటి వార్తలు విస్తృతం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హెచ్చరించారు. తాను గత 10 ఏళ్ల ఎంపీగా పని చేసానని..తమ నియోజకవర్గంలో సమస్యలను చెప్పుకునేందుకే సీఎంను కలిసినట్లు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాను గతంలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌లను కూడా కలిసినట్లు చెప్పారు.
 
గత ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ నుండి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి చెందిన కవిత తిరిగి లోక్ సభకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆమె నిజామాబాద్ ప్రాంతంకు ప్రచారంకు పరిమితమయ్యారు. అయితే అక్కడ ఈ సారయినా గెలిచే నమ్మకం లేకపోవడంతో మెదక్ సీటుకోసం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
 
ఒక విధంగా బిఆర్ఎస్ కు మొత్తం తెలంగాణాలో లోక్ సభ ఎన్నికలలో గట్టిగా గెలుపొందే అవకాశాలు గల సీటు మెదక్ అని భావిస్తున్నారు. కేసీఆర్, హరీష్ రావు లు ఇద్దరూ అక్కడి నుండి ఎమ్యెల్యేలుగా ఎన్నికయ్యారు. మొత్తం ఏడు ఎమ్యెల్యే సీట్లను బిఆర్ఎస్ గెల్చుకుంది. కేసీఆర్ లేదా కేటీఆర్ పోటీ చేయవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.
 
ప్రస్తుతం మెదక్ జిల్లా రాజకీయాలు అన్ని హరీష్ రావు కనుసన్నలలో జరుగుతున్నాయి. ఎంపీగా అక్కడకు కవిత వస్తే ఆమె జోక్యం ఎక్కువగా ఉంటుందని హరీష్ రావు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకనే ఆమె పోటీ చేస్తే ఈ నలుగురు ఎమ్యెల్యేలు పార్టీని వీడతారనే సంకేతం ఇచ్చేందుకే ఈ భేటీ జరిగిందనే ప్రచారం కూడా జరుగుతోంది.