అత్యంత అవీనీతి శాఖలలో ఎక్సైజ్!

తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని అత్యంత అవినీతి శాఖల్లో కొత్తగా ఎక్కైజ్ శాఖ వచ్చి చేరిందని ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖలతోపాటు ఎక్కైజ్ శాఖ ఇందులోకి చేరిందని ట్వీట్ చేశారు. సీవీ ఆనంద్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ శాఖల్లో అవినీతి నెలకొందని, ఎదైనా ముట్టజెప్పనిదే గానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తయ్యేలా లేదనే ఆరోపణలు తరచూ వింటూనే ఉంటాం. అయితే, ప్రజలు, విపక్షాలు ఆరోపించడం సాధారణమే కానీ ఓ ఐపీఎస్‌ అధికారి ప్రభుత్వ శాఖల్లో అవినీతి నెలకొందని పేర్కొనడం ఇప్పుడు సంచనలంగా మారింది. ఈ మధ్య సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉంటూ, నిత్యం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్న సీవీ ఆనంద్ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు చేసిన సమాధానం ఇప్పుడు కలకలం రేపుతోంది.

కల్లుగీత కార్మికుల లైసెన్సుల కోసం లంచం తీసుకుంటూ జడ్చర్ల ఎక్సైజ్‌ సీఐ రాత్‌నావత్‌ బాలోజీ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌ మండలం పోతులమడుగు గ్రామానికి చెందిన గౌడ కులస్థులు టీఎఫ్‌టీ లైసెన్సు కోసం జనవరి 17న దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును జడ్చర్ల ఎక్సైజ్‌ సీఐ కార్యాలయానికి పంపించడంతో 18న బాధితులు సీఐ బాలోజీని కలిశారు. 

లైసెన్సు కావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని బాలోజీ డిమాండు చేయగా, రూ. 90 వేలకు డీల్ కుదిరింది. ఇక అదే రోజు రూ. 25 వేలు కూడా ఇచ్చారు. మిగతా డబ్బు ఇచ్చే సమయంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించటంతో ప్లాన్ ప్రకారం రెడ్ హ్యాండెడ్‌గా సీఐని అధికారులు పట్టుకున్నారు. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రమేష్ వైట్ల అనే జర్నలిస్టు ఏసీబీ రాకింగ్  అంటూ సీవీ ఆనంద్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌కు స్పందిస్తూ తెలంగాణలో రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలతో పాటు ఎక్సైజ్‌ శాఖలో కూడా అవినీతి తీవ్రస్థాయిలో పెరిగిపోయిందంటూ సమాధానం ఇచ్చారు.  కాగా,  సీవీ ఆనంద్ లాంటి ఐపీఎస్ ఇలా బహిరంగంగానే ప్రభుత్వ శాఖలపై ఇలాంటి కామెంట్ చేయటం అందరినీ విస్మయ పరుస్తోంది. అందులోనూ. ఆయన పని చేసిన పోలీస్ శాఖ కూడా ఉందని పేర్కొనటం గమనార్హం.