తెలంగాణ కేబినెట్ స‌మావేశానికి అనుమ‌తివ్వ‌ని ఈసీ

తెలంగాణ కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం జరగాల్సిన కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వలేదు.  ఒక వైపు లోక్‌స‌భ ఎన్నిక‌ల కోడ్, మ‌రో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో రేవంత్ కేబినెట్ స‌మావేశానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి ఇవ్వ‌లేదు. 

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉందంటూ ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ఈ నెల 27న ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ – న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. జూన్ 4న లోక్‌స‌భ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు అనంత‌రం ఎన్నిక‌ల కోడ్ ముగియ‌నుంది.

దీంతో సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ భేటీ చర్చిస్తున్నారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌రుగుతుంద‌ని రెండు రోజుల నుండి ప్ర‌భుత్వం చెబుతున్నది. ఏపీ, తెలంగాణ మధ్య విభజన అంశాలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చించే అవకాశం ఉందని తెలిపింది.