ఆరు గ్యారంటీలను విస్మరించే ప్రయత్నం 

ఆరు గ్యారంటీలను విస్మరించే ప్రయత్నం 
శాసనసభలో కాంగ్రెస్ తీరు చూస్తుంటే ఆరు గ్యారంటీలను విస్మరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో కేంద్రం తెలంగాణకు పది లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. 
ఆరు గ్యారంటీలను అమలు చేసేవరకు వెంటాడుతామని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ హెచ్చరించారు.  కంటోన్మెంట్ భూముల అంశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి మరిచిపోయారని ధ్వజమెత్తారు. ఆర్‌ఆర్‌ఆర్‌ అంశంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. బీజేపీపై ఉన్న కక్ష్యపూరితమైన చర్యలను అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ నేతలు బయటపెట్టుకున్నారని ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి విమర్శించారు.కాంగ్రెస్​ ప్రభుత్వం ఏడు నెలల కాలంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయకపోవడం కారణంగా, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవటానికే ఈ తీర్మానం. ఆ వ్యతిరేకతను కేంద్రంపై నెట్టాలనే ఇవాళ శాసనసభలో బడ్జెట్​పై తీర్మానం ప్రవేశపెట్టారు. ఆరు గ్యారంటీల హామీలను అమలు చేసేంత వరకు బీజేపీ నిలదీస్తుంది.” అని పాయల్ శంకర్స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్​కు నిధులు కేటాయిస్తే తెలంగాణ కాంగ్రెస్​కు బాధేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సిరిసిల్ల, సిద్దిపేట నిధులు కేటాయించుకుంటే, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కొడంగల్​కు నిధులు కేటాయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడబ్బ సొమ్మని కేటాయించుకుంటారని ప్రశ్నించారు.

అసెంబ్లీలో ఇవాళ ఒక దుర్దినము అని సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు.  కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించారు. కేసీఆర్ అవాకులు చివాకులు మాట్లాడి పోయారని అందుకే అసెంబ్లీకి రావడానికి మొహం లేదన్నారు. ఇవాళ సభలో పెట్టిన తీర్మానం పనికిరానిది స్పష్టం చేశారు.