రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు భరోసా వ్యక్తం చేశారు. మోయినాబాద్‌లో నిర్వహించిన “పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్” రంగారెడ్డి జిల్లా బిజెపి ప్రశిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ ఇక్కడ కూడా “డబుల్ ఇంజన్ సర్కార్” ఏర్పాటు కోసం రంగారెడ్డి జిల్లా నుంచే కార్యకర్తలంతా విభేదాలు పక్కనపెట్టి, సమన్వయంతో ఒక బృహత్తర లక్ష్యంతో కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల మెంటాలిటీ ఒకటేనని, యువతను రెచ్చగొట్టి రైల్వే స్టేషన్లు, ఆఫీసులు తగలబెట్టించేటువంటి విచ్ఛిన్నకర శక్తులకు ఇరు పార్టీల నేతలు మద్దతు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఆయన విమర్శించారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అనేక చోట్ల కొనుగోలు కేంద్రాల్లోని రైతుల ధాన్యం, మక్కలు, జొన్నలు తడిసి ముద్దయ్యాయని, కొనే నాథుడు లేక రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “చివరి గింజ వరకు కొంటామని” చెప్పి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, తన చేతగానితనాన్ని కేంద్రం మీదకు నెడుతోందని విమర్శించారు. రైతుల హక్కుల కోసం బిజెపి చేపట్టిన ‘రైతు గోస – బిజెపి భరోసా’ యాత్ర నిర్మల్ (సారంగపూర్) తో ముగిసినా రైతులకు న్యాయం జరిగే వరకు బిజెపి పోరాటం ఆగదని హెచ్చరించారు.
బిజెపి నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి, హౌస్ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బిజెపి సిద్ధాంతంలో, మేనిఫెస్టోలో భాగమైన ఆర్టికల్ 370 రద్దును ఏ విధంగా సాధించామో, అదే విధంగా దేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా అంతే అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఉత్తరాఖండ్, గోవా, అస్సాం రాష్ట్రాలు ఈ చట్టాన్ని తీసుకొచ్చాయని, అస్సాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.
ఓటర్ల జాబితా ప్రక్షాళన (ఎస్ఐఆర్) పై సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పు పట్ల హర్షం ప్రకటిస్తూ దొంగ ఓటర్లు, చనిపోయిన వారి ఓట్లను తొలగించేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 10 సార్లు ఈ ప్రక్షాళన జరిగినా మాట్లాడని వారు ఇప్పుడు ఓటమి భయంతోనే ఈవీఎంలపై, ఎస్ఐఆర్ లపై సాకులు వెతుకుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

More Stories
కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దు నిద్ర వల్లే అన్నదాతల కన్నీరు
సిద్దిపేట జిల్లాలో కాకతీయ గణపతిదేవుని శిల్పం గుర్తింపు
మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు