* ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షల ఓట్లను మళ్లీ తిరిగి వెనక్కి తీసుకునేందుకు వీలు లేని (అన్కలెక్టబుల్) వాటిగా పరిగణిస్తూ వాటిని తొలగించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.
సర్వే పూర్తయిన ప్రాంతాల్లో ఓటర్లకు నూరు ఎన్యూమరేషన్ పత్రాలు అందించామని, వాటిలో కొన్ని పత్రాలు సేకరించేందుకు వీలు లేకుండా ఉండటంతో వాటిని అన్కలెక్టబుల్గా నిర్ధారిస్తున్నట్లు అధికారులు గణాంకాలతో చూపిస్తున్నట్లు తెలిసింది. అన్కలెక్టబుల్ జాబితాలో ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ (ఏఎస్‌డీ) కేటగిరీ కింద ఉండే ఓటర్లను చేరుస్తూ, వారి ఓట్లను తీసివేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు చెబుతున్నారు.
అయితే 14 రోజుల కిందట సోషల్ మీడియాలో ఎలక్షన్ కమిషన్ డ్యాష్బోర్డు వైరల్ అయ్యింది. అందులో 13 లక్షల మంది ఓటర్లు ఏఎస్డీ పరిధిలో అన్కలెక్టబుల్ కింద నమోదైనట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ సంఖ్య రెండు వారాల్లోనే 40 లక్షలకు చేరుకోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 3.38కోట్లకు పైగా ఓటర్లు ఉండగా ఇంకా సుమారు 60 లక్షల మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించలేదు.
వారిలో సుమారు 30లక్షల మంది అన్కలెక్టెబుల్ కేటగిరీలో ఉన్నట్లు బీఎల్‌ఓలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి నివేదించినట్లు తెలుస్తోంది. చనిపోవడం లేదా శాశ్వతంగా మరో ప్రాంతానికి వెళ్లిపోవడం లేదా పూర్తిగా అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల ఫారాలు ఇవ్వడం లేదని గుర్తించారు. అలాంటి ఓటర్ల పేరు ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు దాదాపు 76.72 శాతం (2,59,50,506) డిజిటలైజేషన్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఆబ్సెంట్ (అందుబాటులో లేనివారు), షిఫ్టెడ్ (చిరునామా మారినవారు), డెడ్ (మరణించినవారు) కేటగిరీ కింద తొలగించే ఓట్ల సంఖ్య ఒక్కసారిగా పెరగడంపై ఆందోళన వ్యక్తం అవుతుంది.
రెండు వారాల క్రితం ఈసీ డ్యాష్‌బోర్డ్‌లో ఈ కారణాలతో 13 లక్షల ఓట్లు మాత్రమే నమోదు కాగా, కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ సంఖ్య 40 లక్షలకు చేరుకోవడం గమనార్హం. పలు కీలక నియోజకవర్గాల్లో ఏకంగా 20% నుండి 28% వరకు ఓట్లు అన్కలెక్టబుల్ జాబితాలోకి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.
కాగా, ఆగస్టు3వ తేదీతో పూర్తి కావాల్సిన ఎన్యూమరేషన్ ప్రక్రియను ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తయినప్పటికీ, ఓటర్లు వాటిని నింపి ఇవ్వాల్సి ఉంది. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంది. జూన్ 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతోంది.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 77.12 శాతం ఎన్యూమరేషన్ పూర్తయినట్లు ఈసీ తెలిపింది. హైదరాబాద్ నగరంలో 56.31 శాతం, రంగారెడ్డి జిల్లాలో 63.43 శాతం ఎన్యుమరేషన్ పూర్తయినట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61.37శాతం ఎన్యుమరేషన్ పూర్తయింది.

More Stories
‘దారితప్పిన వారికి’ మార్గదర్శనం.. ప్రధాని మోదీ పిలుపు
భోగాపురం విమానాశ్రయంకు ప్రధాని మోదీ నేడే ప్రారంభోత్సవం!
నిఘా అధికారి హత్యలో మాజీ ఆప్ కౌన్సిలర్ కు జీవిత ఖైదు