నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎందరో మహనీయులు త్యాగాలు, బలిదానాలు చేశారని, వారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై, ఇక్కడి ప్రజలు స్వేచ్ఛను పొందిన సెప్టెంబర్ 17వ తేదీ ప్రాధాన్యతను, చారిత్రక నేపథ్యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుండటం హర్షణీయమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆయన కోరారు.
హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) రెండు రోజుల ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సంస్థానంలో ప్రజలపై జరిగిన దమనకాండ, నిజాం వ్యతిరేక పోరాటంలో సమరయోధుల పాత్ర, భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం వరకు జరిగిన ప్రధాన సంఘటనలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను బుధవారం దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావులతో కలిసి ఆయన ఫొటో ప్రదర్శనను పరిశీలించారు. హైదరాబాద్ విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన వారి చరిత్ర, త్యాగాలను వివరిస్తూ ప్రదర్శనను ఏర్పాటు చేసిన సీబీసీని ఆయన అభినందించారు. ఈ ప్రదర్శనను ప్రతి విద్యార్థి తప్పక చూడాలని దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్ విముక్తి పోరాటాన్ని గుర్తుచేస్తూ, నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా కులమతాలకు అతీతంగా పోరాడారని దత్తాత్రేయ తెలిపారు. ప్రజల వేషభాషలు, సంస్కృతి, సంప్రదాయాలపై నిజాం సాగించిన అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల చరిత్ర పట్ల మనమంతా గర్వపడాలని పేర్కొన్నారు.
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, వందేమాతరం నినాదం చేసినందుకు జైలులో పెట్టడం, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు కాల్చి చంపడం వంటి దారుణ ఘటనలు నిజాం పాలనలో చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ, గౌరవం వెనుక ఎన్నో త్యాగాలు, బలిదానాలు ఉన్నాయని తెలిపారు. త్యాగాలతో కూడిన ఈ పోరాట చరిత్ర తరతరాలకు అందాలని, రాంజీ గోండు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి వీరుల త్యాగాలను నేటి తరం విద్యార్థులు, యువత గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.

More Stories
చరిత్రలో మొదటిసారి భద్రతా హెచ్చరికల మధ్య మక్కా
పెల్లెట్ గన్ వాడకంపై దర్యాప్తు కమిటీ మార్పుకు సుప్రీం నిరాకరణ
భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాక్ నౌక..పాక్ రాయబారికి సమన్లు