ఇటీవలి ‘బొద్దింకల జనతా పార్టీ’ నిరసనల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్న కంటెంట్‌పై మెటా ఇండియా హెడ్‌తో పాటు పలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రధానమంత్రికి సంబంధించిన మార్ఫింగ్ చేసిన, అభ్యంతరకరమైన వీడియోలు, చిత్రాలను వ్యాప్తి చేశారన్న ఆరోపణలపై మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రిని అసభ్యకరంగా, అవమానకరంగా, తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ చేసి, డిజిటల్‌గా మార్పులు చేసిన అనేక వీడియోలు, చిత్రాలు తమకు కనిపించాయని ఇద్దరు వ్యక్తులు చేసిన ఫిర్యాదుల మేరకు ఈ కేసులు నమోదయ్యాయి.
“ఆ వాఖ్యలలో గౌరవనీయ ప్రధానమంత్రిని, మార్ఫింగ్ చేసిన కంటెంట్‌లో చిత్రీకరించిన ఇతర వ్యక్తులను ఉద్దేశించి అభ్యంతరకరమైన భాష, ఎగతాళి, అసభ్యకరమైన వ్యాఖ్యలు ఉన్నాయి. తద్వారా ఆ పోస్టుల అభ్యంతరకర స్వభావాన్ని పెంచి, వాటి విస్తృత వ్యాప్తిని, ఆదరణను ప్రోత్సహిస్తున్నాయి. పైన పేర్కొన్న కంటెంట్ డిజిటల్‌గా మార్చబడినట్లు లేదా ఏఐ ద్వారా సృష్టించి సోషల్ మీడియాలో వ్యాప్తి చేసినట్లు కనిపిస్తోంది,” అని ఫిర్యాదులలో పేర్కొన్నారు.
“ఇలాంటి కంటెంట్ ప్రజలను తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, విద్వేషాన్ని లేదా ప్రజా అశాంతిని రెచ్చగొట్టడం, ప్రజా మర్యాదకు భంగం కలిగించడం, ప్రజా ప్రముఖుల గౌరవాన్ని కించపరచడం లేదా అవమానించడం, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించడం, సమాజంలోని వివిధ వర్గాల మధ్య విద్వేషాలను పెంచడం, ఇతరత్రా వర్తించే చట్ట నిబంధనలను ఉల్లంఘించే సామర్థ్యాన్ని కలిగి ఉంది,” అని ఫిర్యాదుదారులు తెలిపారు.
విద్యార్థుల నిరసన సందర్భంగా అసభ్యకరమైన, దూషణలతో కూడిన అనేక పోస్టులు, వ్యాఖ్యలు పరిశీలనలోకి వచ్చాయి. 29 ఏళ్ల వ్యాపారవేత్త ఎస్. అరవింద్ రెడ్డి, తెలంగాణ బీజేపీ కార్యకర్త టి. సాయికిరణ్ గౌడ్ ఈ ఫిర్యాదులను దాఖలు చేశారు. ప్రధాని ఖాతా నుండి పోస్ట్ చేసిన ఒక వీడియోను ఫేస్‌బుక్‌లో కొద్దిసేపు బ్లాక్ చేసిన తర్వాత, ఈ వారం ప్రారంభంలో మెటా ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు.
కొద్ది రోజుల క్రితం, జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలు, జూలై 20 నాటి ‘సంసద్ చలో’ ర్యాలీకి సంబంధించిన హింసాత్మక ఘటనల సమయంలో అప్‌లోడ్ చేసిన, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన, దూషణపూరిత వ్యాఖ్యలు కలిగిన పోస్ట్‌లు, వీడియోలను తొలగించాలని ఢిల్లీ పోలీసులు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించారు.

More Stories
ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్!
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కన్నుమూత
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట