మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్‌ను పోలీసులు 10 రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించడంతో చోరీకి ముందే వేసిన ప్రణాళిక, ఆర్మీలోని కొందరి సహకారం, ఆయుధాలను తరలించిన విధానం వంటి అంశాలు బయటపడినట్లు చెబుతున్నారు. ఉప్పుతోళ్ల మల్లేశ్ 2009లో భారత ఆర్మీలో చేరాడు. విధుల్లో భాగంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిపై శిక్షణ పొందిన అతడు.. వివిధ కంటోన్మెంట్లలో ఆయుధాగారాలకు సంబంధించిన బాధ్యతలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇక చోరీ చేసిన ఆయుధాలను కోల్‌కతాకు చెందిన బీర్బల్ షా ద్వారా ఆయుధ డీలర్ అవల్దెయ్ అలియాస్ ఓబీకి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు తేలింది. ఈ అక్రమ ఆయుధాల నెట్‌వర్క్‌కు సంబంధించి బంగ్లాదేశ్ నుంచి వచ్చే వ్యక్తులు, రోహింగ్యాలతో సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. 16 ఏళ్ల ఆర్మీ సర్వీస్ పూర్తైన తర్వాత మరో మూడేళ్ల సర్వీస్‌కు అవకాశం ఉన్నప్పటికీ పొడిగించకపోవడంతో మల్లేశ్‌లో అసంతృప్తి పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
2022లో కలకత్తా బ్యారక్‌పూర్ కంటోన్మెంట్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో యూనిట్ సమీపంలో చెరుకు రసం దుకాణదారుడు బీర్బల్ షాతో మల్లేశ్‌కు పరిచయం ఏర్పడింది. బీర్బల్ షా దేశంలో అక్రమంగా తుపాకులు సేకరించి విక్రయించే అవల్దెయ్ను మల్లేశ్‌కు పరిచయం చేశాడు. ఓబీ స్మగ్లరా కాదా అని తెలుసుకునేందుకు రూ.10 వేలకు ఓ తుపాకీ కొనుగోలు చేసిన మల్లేశ్, దానితో అమాయకులను బెదిరించి దారి దోపిడీ చేయాలని ప్రయత్నించినట్లు సమాచారం.
కోల్‌కతాలో అది సాధ్యం కాకపోవడంతో దానిని ఉపయోగించకుండా స్వగ్రామంలో దాచినట్లు పోలీసులు వెల్లడించారు. ఆర్మీలోకి చేరకముందే నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. 2005లో అచ్చంపేట పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు.. 2007లో అమ్రాబాద్ పరిధిలో బంగారం, వెండి చోరీకి సంబంధించిన మరో కేసులో అతడు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ కేసులు ఉన్నప్పటికీ మల్లేశ్ ఆర్మీ ఉద్యోగానికి ఎలా ఎంపికయ్యాడు? నియామక సమయంలో అతని పూర్వ నేరచరిత్ర అధికారుల దృష్టికి వచ్చిందా? అనే అంశాలపై మిలిటరీ ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు విడివిడిగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కుటుంబంతో కలిసి యాప్రాల్‌లో నివసిస్తూ నాగర్‌కర్నూల్‌లో తనకు ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం ప్రారంభించాడు.
రిటైర్మెంట్ ప్రయోజనాలు వస్తాయనే అంచనాతో అప్పులు చేసి నిర్మాణం చేపట్టడంతో పాటు సుమారు రూ.8 లక్షల విలువైన ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఆర్మీ ఆయుధాలను చోరీ చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం.
తొలుత తన చిన్ననాటి స్నేహితులు నిరంజన్, మల్లికార్జున్‌తో కలిసి చోరీకి ప్లాన్ చేసినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో మల్లేశ్ వ్యూహాన్ని మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జూలై నుంచి మద్రాస్ రెజిమెంట్ 20వ బెటాలియన్‌లో మల్లేశ్ పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. చోరీకి వారం రోజుల ముందే సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసినట్లు, ఘటన జరిగిన రోజు కెమెరాలపై ఫోమ్ చల్లినట్లు సమాచారం.
పోలీసుల దర్యాప్తు ప్రకారం చోరీ జరిగిన సమయంలో మల్లేశ్‌కు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్, శేషులు లైట్లను ఆర్పివేశారని, ఇతర జవాన్ల దృష్టిని మళ్లించేలా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో మల్లేశ్ సుమారు గంటన్నరపాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్కడి నుంచి తరలించినట్లు విచారణలో వెల్లడైనట్టు సమాచారం.
తొలుత బైక్‌పై వాటిని తరలించి, ఆ తర్వాత కారులో నాగర్‌కర్నూల్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి దాచినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న బీర్బల్ షా, అవల్ దెయ్ అలియాస్ ఓబీ కోసం పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. బీర్బల్ షా బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచ్చి అక్కడ నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వీరిద్దరికి దేశవ్యాప్తంగా అక్రమ ఆయుధాల నెట్వర్క్ ఉందా? బొల్లారం ఆయుధాల చోరీ వెనుక మరెవరైనా ఉన్నారా? చోరీ చేసిన ఆయుధాలు ఇతర ప్రాంతాలకు చేరాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

More Stories
రాయలసీమను రతనాల సీమగా మార్చే హార్టికల్చర్ హబ్
చైనాను ఓడించి 44 ఏళ్ల తర్వాత హాకీలో బంగారు పతకం
`ఆత్మగౌరవంతో చనిపోవడం మేలు’ అంటూ కాంగ్రెస్ కు రాజీనామా