కాజీపేట రైల్వే యూనిట్‌లో 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ

కాజీపేట రైల్వే యూనిట్‌లో  200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ

తెలంగాణలోని చారిత్రాత్మక రైల్వే జంక్షన్ కాజీపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్వే తయారీ యూనిట్ (పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ అత్యాధునిక కర్మాగారంలో సరికొత్త ‘ఇంటర్ సిటీ’ రైళ్ల ఉత్పత్తి ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విినీ వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. 

ఈ మెగా ఫ్యాక్టరీ కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలపై  కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు, రైల్వే  ఉన్నతాధికారులతో నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో  కాజీపేట రైల్వే యూనిట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రానున్న ఐదేళ్ల కాలంలో దేశీయ అవసరాల కోసం ఏకంగా 200 ఇంటర్ సిటీ రైళ్లను ఇక్కడే తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాలకు, పట్టణాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ఈ రైళ్లను ప్రత్యేకంగా కేటాయించనున్నారు. నిత్యం వివిధ పనుల కోసం పొరుగు పట్టణాలకు వెళ్లే ఉద్యోగులు, ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులు, వ్యాపారస్తులకు ఈ సర్వీసులు ఎంతో సురక్షితమైన, సరసమైన ప్రయాణ ప్రత్యామ్నాయంగా మారనున్నాయి. దీనివల్ల రోడ్డు రవాణాపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.

కాజీపేటలో తయారయ్యే ఈ సరికొత్త ఇంటర్ సిటీ రైళ్లు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని రైల్వే మంత్రి వివరించారు.  కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ ఇంటర్‌ సిటీ రైళ్లు మెట్రో తరహాలో ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్‌తోపాటు మెరుగైన వెంటిలేషన్‌తో తయారు చేయనున్నట్లు తెలిపారు.  ప్రతి ఇంటర్‌సిటీ రైలులో సురక్షితమైన డిజైన్‌తో కూడిన  20 కోచ్‌లు ఉంటాయని, వాటిలో సురక్షితమైన కోచ్ డిజైన్, అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. 

ఈ ఇంటర్‌సిటీ రైళ్లను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా తయారు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రయాణం కుదుపులు లేకుండా ఉండేందుకు ‘జెర్క్-ఫ్రీ కప్లర్స్’ను అమరుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఆదా ధ్యేయంగా ఈ రైళ్లలో అత్యంత ప్రతిష్టాత్మకమైన “రీజనరేటివ్ బ్రేకింగ్”  సాంకేతికతను వాడుతున్నారు. ఈ విధానం ద్వారా రైలుకు బ్రేకులు వేసిన ప్రతిసారీ అది ఒక విద్యుత్ జనరేటర్‌లా మారుతుంది.