భూవివాదంలో పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి

మాజీ బిఆర్ఎస్ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ భూ వివాదంలో హైదరాబాద్‌ పేట్ బషీరాబాద్ పోలీసులు మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. తాను కొనుగోలు చేసిన భూమిని మరొకరు ఆక్రమించారని మల్లారెడ్డి ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపుతప్పే పరిస్థితి ఉండటంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. స్థలంలో వేసిన భారీ కేడ్లను మాజీ మంత్రి మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగిస్తుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎంఎల్ఎ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మల్లారెడ్డి అనుచరులు పోలీసుల ముందే ఫెన్సింగ్‌ను కూల్చేశారు.. అయితే అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని చెప్పారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెబుతున్నారు. మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది ఆరోపిస్తున్నారు.  తన స్థలాన్ని కాపాడుకుంటానని మల్లారెడ్డి తన అనుచరులతో ఫెన్సింగ్ తొలగించేందుకు ప్రయత్నించారు.  పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

మల్లారెడ్డిపై గతంలో కూడా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని మల్లారెడ్డిపై అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గత ఏడాది శామీర్ పేట పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు.  మేడ్చల్‌ మల్కాజ్ గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని శామీర్‌పేట పోలీస్ స్టేషన్ లో కేతావత్ భిక్షపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.