వికసిత్ భారత్.. 2024 లోనూ కొనసాగిద్దాం : మోడీ

వికసిత్ భారత్.. 2024 లోనూ కొనసాగిద్దాం : మోడీ
ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ వినిపించారు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కొత్తయేడాది శుభాకాంక్షలు తెలియజేస్తూనే.. 2023 లో జరిగిన ఎన్నో విషయాలు, కొత్త యేడాదిలో సాధించాల్సిన అంశాలను స్పృశిస్తూ ఆయన ప్రసంగం సాగింది. 2023 లో దేశ ప్రజల్లో వికసిత్ భారత్ స్ఫూర్తి రగిలిందని.. ఈ సందర్భంగా మోడీ తెలియజేశారు. దీన్ని కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇది 108 వ ఎపిసోడ్ అని.. మన విశ్వాసాల్లో ఈ అంకెను ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు.
ఈ ఏడాది మన దేశం ఎన్నో ప్రత్యేక విజయాలు సాధించడం 140 కోట్ల మంది భారతీయుల బలమని ప్రధాని మోడీ అన్నారు. ఇవాళ దేశంలోని ప్రతి మూల కూడా ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోందని.. అభివృద్ధి చెందిన, స్వావలంబన స్ఫూర్తితో నిండి ఉందని అన్నారు. 2024లో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇక గతేడాది సాధించిన విజయాలను గుర్తుచేస్తూ.. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు ఈ సంవత్సరంలోనే ఆమోదం లభించిందని.. భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని మోడీ పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.
భారత్ ఇన్నోవేషన్ హబ్‌గా మారుతోందని.. ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. 2015లో మేము గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంక్‌లో 81వ స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది 40వ స్థానంలో ఉందని.. అది ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఈసారి క్యూఎస్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో.. అత్యధిక సంఖ్యలో భారతీయ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయని వివరించారు. అలాగే కాశీ-తమిళ సంగమం కార్యక్రమంలో ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ ఉపయోగించి తాను మాట్లాడిన హిందీ భాషను అదే సమయంలో ఇంగ్లీష్ లో తర్జుమా చేసి వినిపించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు.
శాస్త్రవేత్తల కృషితో చంద్రయాన్‌-3 విజయవంతం అయ్యిందని.. ఇది అందరికీ గర్వకారణమని మోడీ తెలిపారు. ఈ సందర్భంగా శారీరక, మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను ప్రధాని నొక్కి చెప్పారు. ఆ దిశగా చేపట్టిన “ఫిట్‌ ఇండియా”లో భాగంగా తీసుకున్న పలు చర్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా.. ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌, భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌, నటుడు అక్షయ్‌ కుమార్‌ తమ ఫిట్‌నెస్‌ రహస్యాలను పంచుకున్నారు.
2023లో భారతీయుల సృజనాత్మకతను యావత్‌ ప్రపంచం వీక్షించిందని మోడీ తెలిపారు. “నాటు నాటు” పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగిందని.. “ఎలిఫెంట్‌ విస్పరర్స్‌”కు సైతం ఆస్కార్ రావటంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసిందని వ్యాఖ్యానించారు. ఈ ఏడాదిలో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చూపారని కొనియాడారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలతో సత్తాచాటారని గుర్తు చేశారు. వన్డే ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు గెలుచుకుందని ప్రశంసించారు.
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంపై దేశం మొత్తం ఉత్సుకతతో ఎదురుచూస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో కళాప్రపంచం తనదైన శైలిలో భాగస్వామ్యం అవుతోందని మోడీ అభిప్రాయపడ్డారు. అలాంటి సృజనాత్మకను సోషల్ మీడియాలో ‘#శ్రీరామభజన్‌’తో పంచుకోవాలని దేశప్రజలను మోడీ కోరారు.