కశ్మీర్‌లో తెహ్రీక్‌ ఏ హురియత్‌పై నిషేధం!

భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రమేయమున్న సంస్థలపై చర్యలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరింత తీవ్రం చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన తెహ్రీక్-ఎ-హురియత్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఉపా చట్టం ప్రకారం చర్యలు చేపట్టిన్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వెల్లడించారు. 
 
హురియత్‌ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడదీసి రాష్ట్రంలో ఇస్లాం పాలనను నెలకొల్పాలని చూస్తోందని ఆరోపించారు. భారత్‌పై దుష్ప్రచారం చేసేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు తెహ్రీక్-ఏ-హురియత్ ఏర్పడిందని, ఉపాచట్టం కింద జమ్మూ కశ్మీర్‌లో తెహ్రీక్-ఎ-హురియత్‌ను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించినట్లు అమిత్ షా వెల్లడించారు. 
 
భారత్ నుంచి జమ్మూకశ్మీర్‌ను విడగొట్టేందుకు, ఇస్లాం లా స్థాపించేందుకు తెహ్రిక్-ఇ-హురియత్ పనిచేస్తోందని, భారత్ వ్యతిరేక ప్రచారం, జమ్మూకశ్మీర్ ‌లో వేర్పాటువాదానికి ఆ సంస్థ పాల్పడుతోందని గుర్తించామని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  చట్టవిరుద్ధ కార్యకలాపా నిరోధక చట్టం  (ఉపా) 1967 సెక్షన్ 3(1) కింద తెహ్రిక్-ఇ-హురియత్, జమ్మూకశ్మీర్ (టెక్)ను భారత ప్రభుత్వం నిషేధించింది.  జమ్మూ కశ్మీర్‌ వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ షా గిలానీ 2004లో తెహ్రీక్‌ ఏ హురియత్‌ను స్థాపించారు. 

గిలానీ తర్వాత అనంతరం తెహ్రీక్-ఎ-హురియత్ చైర్మన్ ముహమ్మద్ అష్రాఫ్ సెహ్రాయ్ పని చేశారు. 2021 సంవత్సరంలో ఆయన మరణించాడు. ప్రస్తుతం ఈ ఉగ్రసంస్థకు మసరత్ అలామ్ భట్ సారధ్యం వహిస్తున్నారు.  భారత్ వ్యతిరేక, పాక్-అనుకూల విష ప్రచారంలో దిట్టగా భట్‌కు పేరుంది.  

హురియత్ కాన్ఫరెన్స్ అనేది జమ్మూ కశ్మీర్‌లోని 26 సంస్థల సమూహం. ఇది 1993లో ఏర్పడింది.  హురియత్ కాన్ఫరెన్స్‌లో పాకిస్తాన్ అనుకూల, వేర్పాటువాద సంస్థలు ఉన్నాయి. వీటిలో జమాత్-ఎ-ఇస్లామీ, జేకేఎల్‌ఎఫ్‌, దుఖ్తరన్-ఎ-మిల్లత్ మొదలైన పేర్లు ఉన్నాయి. 2005లో హురియత్ కాన్ఫరెన్స్ రెండు వర్గాలుగా విడిపోయింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించరాదనే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ భారత్ వ్యతిరేక ప్రచారానికి పాల్పడినట్టు గుర్తిస్తే వాటిని బలంగా తిప్పికొడతామని అమిత్ షా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.  కాగా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన ముస్లింలీగ్ జమ్మూకశ్మీర్-మసరత్ అలామ్ వర్గం (ఎంఎల్‌జేకే-ఎంఏ)పై కూడా కేంద్ర హోం శాఖ ఈనెల 27న నిషేధం విధించింది.