బిజెపి మూడోసారి అధికారం చేజిక్కించుకోవడం తథ్యం

* ది గార్డియన్ పత్రికలో యూకే కాలమిస్ట్ హానా ఎల్లిస్ పీటర్స్ కథనం

‘మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం..మోదీ అసాధారన ప్రజాదరణ ..రామమందిర ప్రారంభోత్సవం.. వెరసి ప్రధాని సారథ్యంలో బిజెపి మూడోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం తథ్యం’ అని యూకే కాలమిస్ట్ హానా ఎల్లిస్ పీటర్స్ స్పష్టం చేశారు. ఈ మేరకు ది గార్డియన్ దినపత్రిలో తన కాలమ్‌లో అభిప్రాయపడ్డారు.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు బిజెపి బలం, ఉత్సాహం మరింత పెంచాయని హానా ఎల్లిస్ పీటర్స్ తెలిపారు. ఈ విజయాల అనంతరం ప్రధాని స్పందిస్తూ మూడోసారి గెలుపొందడం తధ్యం అని పేర్కొనడాన్ని కూడా హానా ఎల్లిస్ తన కాలమ్‌లో ప్రస్తావించారు. 

ప్రస్తుతం దేశంలో రాజకీయ వాతావరణాన్ని బట్టి మోదీకి విజయావకాశాలు ఎక్కువని దేశంలో అధిక శాతం పరిశీలకులు అభిప్రాయపడుతున్నట్టు తేల్చేశారు. ‘‘రాజకీయ ఉద్దండుడిగా ప్రధాని మోదీ ప్రజాదరణతోపాటూ బిజెపి హిందూ జాతీయవాద ఎజెండా హిందువులను ఆకట్టుకుంటున్నాయి. 2014 తరువాత రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పరిస్థితులు మోదీకి అనుకూలంగా మారాయి’’ అని హానా పేర్కొన్నారు.

దక్షిణ, తూర్పు భారతంలో బిజెపి ప్రత్యర్థులు కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో బలహీనంగా ఉందని చెప్పారు. కేవలం మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయనేఅభిప్రాయం నెలకొందని చెప్పారు. అంతేకాకుండా, బిజెపి ప్రతిపక్షాల జాతీయ స్థాయి కూటమి ‘ఇండియా’లో కీలక అంశాల్లో ఏకాభిప్రాయం రావాల్సి ఉందని కూడా పేర్కొన్నారు. 

ఇప్పటికే బిజెపి ఎన్నికల కదనరంగంలోకి దిగిందని, వికసిత భారత సంకల్ప యాత్ర ఇందులో భాగమేనని తెలిపారు. బిజెపి విజయాల గురించి గ్రామల వరకూ చేర్చాలని అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. మోదీ ప్రజాదరణ, సంక్షేమ పథకాలు, హిందుత్వ ఎజెండాతో బిజెపి వ్యూహాత్మకంగా వెళుతోందని వివరించారు.

ప్రతి ఒక్కరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు

మరోవైపు, దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో ప్రపంచమంతా కొత్త సంవత్సరంలోకి ఎంతో ఉత్సాహంగా అడుగు పెట్టింది. ఎన్నో ఆశలను మోసుకొచ్చిన ఈ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది.  ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిలో ప్రజలంతా సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షించారు. “అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ సంవత్సరం అందరికీ శ్రేయస్సు, శాంతి, అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించాలి” అని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం మన్ కీ బాత్ 108వ ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడారు. 

ప్రస్తుతం మన దేశం సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉందని చెప్పారు. ఆత్మనిర్భరత సాధించడంతోపాటు అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న స్ఫూర్తి అంతటా విరజిల్లుతోందని చెప్పారు. ఇది 2024లోనూ కొనసాగాలని పిలుపునిచ్చారు. అలాగే గతేడాది అనేక రంగాల్లో మన దేశం సాధించిన విజయాలను ప్రధాని ప్రస్తావించారు.