మేడిగడ్డ సాక్షిగా బయటపడ్డ ఉత్తమ్ కుమార్ – కేసీఆర్ లాలూచి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్, బీజేపీ ఒకటే అని, రెండింటిలో ఏ పార్టీకి ఓటువేసినా కేసీఆర్ కే చేరుతుందని కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేసి, కొంతమేరకు ప్రజలను నమ్మించి, తెలంగాణాలో బీజేపీ సృష్టించిన `కేసీఆర్ వ్యతిరేక’ వాతావరణాన్ని హైజాక్ చేసి, బొటాబొటి ఆధిక్యతతో అధికారంలోకి రాగాకుగారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతి కక్కిస్తామని, లక్ష కోట్ల రూపాయలను ప్రజలకు పంపిణి చేస్తామని ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు.
 
అయితే, తీరా అధికారంలోకి వచ్చాక మొదటి నెలలోనే వారి అసలు బండారం బయటపడుతుంది. కేసీఆర్ అవినీతికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నా ఆచరణలో ఒక్కడుగు కూడా ముందుకు పడటం లేదు. ఎంతో ఆర్భాటంగా మేడిగడ్డకు వెళ్లిన ఐదుగురు మంత్రుల బృందం పర్యటన కాంగ్రెస్ – బిఆర్ఎస్ ఏవిధంగా లాలూచీ రాజకీయాలు నడుపుతున్నాయో బట్టబయలు చేసింది.
 
ఎన్నికల సమయంలో మేడిగడ్డ కుంగిపోవడానికి దారితీసిన అవినీతిపై సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపిస్తానని అంటున్నారు. నెలరోజులైనా అందుకు ఎటువంటి ఉత్తరువులు జారీ చేయలేదు. ఇప్పటికే పెండింగ్ కేసులతో సతమవుతున్న న్యాయస్థానాలు ఇటువంటి దర్యాప్తులకు సిట్టింగ్ జడ్జిలను కేటాయించే అవకాశం ఉందా? అదంతా ప్రజలను మభ్యపెట్టే కాలయాపన చర్యగా స్పష్టం అవుతుంది.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుదీర్ఘకాలం కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ప్రయోజనాలు కాపాడేందుకు ఏవిధంగా వ్యవహరించారో అందరికి తెలిసిందే. ఆయన స్వయంగా కాంగ్రెస్ ఎమ్యెల్యేలను అధికార పార్టీలోకి పంపించారని పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ఆరోపణలు చేశారు. 
 
ఉమ్మడి రాష్ట్రంలో హోసింగ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో భారీ అవినీతికి పాల్పడ్డారని, చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత ఎటువంటి చర్య తీసుకోలేదు.  ఇప్పుడు సాగునీటి మంత్రిగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో కేసీఆర్ ను కాపాడేందుకు పట్టుదలతో పనిచేస్తున్నట్లు మేడిగడ్డ పర్యటనలో ఆయన వ్యవహారం వెల్లడించింది. 
 
ఎంతసేపు కాంట్రాక్టర్లపై కన్నెర్ర చేస్తూ, వారితో డబ్బు లేకుండా మరమ్మత్తులు చేయించుకొని ప్రయత్నాలు చేయడం మినహా కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతిని బట్టబయలు చేసి, అవినీతి డబ్బు కక్కించే ప్రయత్నం ఎక్కడా కనిపించడం లేదని కొందరు కాంగ్రెస్ నేతలు సహితం విస్మయం చెందుతున్నారు.
 
ఎంత సేపు ఈ ప్రాజెక్ట్ లో వైఫల్యాలకు భాద్యులు అయిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ ప్రకటనలు చేయడమే గాని `సూపర్ ఇంజనీర్’గా డిజైన్ లు మార్చిన కేసీఆర్ గురించి, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ప్రమేయం గురించి నోరు మెదపడం లేదు.  మేడిగడ్డ సందర్శన సందర్భంగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ ప్రాజెక్ట్ లో చోటు చేసుకున్న అక్రమాలు, మోసాలపై మాట్లాడుతుంటే మధ్యలో అర్ధాంతరంగా ఉత్తమ్ ఆయన్ను ఆపించి తర్వాత మళ్ళీ మాట్లాటదాం అంటూ అందరి దృష్టి మళ్లించడం బహిరంగంగా జరిగింది. 
 
2022 జులైలో వచ్చిన వరదలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని బాహుబలి మోటార్లు మునిగిపోయి కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా దీనికి అయ్యే ఖర్చు అంతా కంపెనీనే భరిస్తుంది అంటూ బిఆర్ఎస్ మంత్రులు చెపుతూ వచ్చారు.  ఇప్పుడు ఈ మోటార్లకు సంబంధించి నిర్మాణ మెగా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ బిల్స్ పెడితే అవి ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు చేరాయని పొంగులేటి ఈ సభలో వెల్లడించారు.  ఈ బిల్స్ ఇంజినీర్లు పెట్టారా? లేక ఎవరైనా పై నుంచి పెట్ట మంటే పెట్టారా? అని కూడా పొంగులేటి ప్రశ్నించారు. 
 
కాళేశ్వరం మోటార్లకు బిల్స్ పెట్టారు అంటే ప్రజలను మోసం చేసేందుకు గత ప్రభుత్వ పెద్దలు అబద్దాలు చెప్పినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే బయటకు చెప్పేది ఒకటి, లోపల చేసేది మరొకటి. అందుకు జీఓ లతో సహా ఏమి బయటకు రాకుండా బిఆర్ఎస్ రహస్య పాలన సాగించింది.  ప్రభుత్వం మారటంతో ఇప్పుడు ఒక్కో విషయం బయటకు వస్తోంది.
 
 ఈ లోగుట్టును బహిర్గతం చేసి తగు చర్యలు చేపట్టాల్సింది సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఆయన ఇటువంటి కీలకమైన అంశాలు అన్నింటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన ధోరణి వెల్లడి చేస్తుంది. ఈ అంశాలను ప్రస్తావిస్తున్న సహచర మంత్రిని కూడా నోరుమెదపకుండా కట్టడి చేయడం కనిపించింది. 
 
మేడిగడ్డ లో పర్యటించిన మంత్రుల్లో ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప అందరూ కెసిఆర్ సర్కారుపై ఏదో ఒక రూపంలో పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. దీంతో కీలక అంశాలను దారిమళ్లించే ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కెసిఆర్ ను రక్షించేందుకు ప్రయతిస్తున్నారా? అన్న అనుమానాలు ప్రభుత్వంలో ఉన్నవారికే వ్యక్తం అవుతున్నాయి. 
 
మంత్రి పదవి చేపట్టగానే, ఈ ప్రాజెక్ట్ పై సమీక్ష నిర్వహించిన సమయంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి) టార్గెట్ చేశారు.  కానీ ఈ తప్పులకు కారణమైన వారిపై, డిజైన్లు ఆమోదించిన వారిపై మాత్రం పెద్దగా మాట్లాడలేదు.  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్నిసార్లు సమీక్షలు నిర్వహించి కూడా ఇప్పటివరకు మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత ఎల్ అండ్ టి పై ఉందా? లేదా? అన్న విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించటం లేదు. తమకు బాధ్యత లేదని, అదనపు చెల్లింపులు చేస్తేనే పనులు చేస్తామని కంపెనీ ప్రభుత్వంకు లేఖ రాయడం జరిగింది.
 
పైగా, మేడిగడ్డ వద్ద ఇంజినీర్లు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవాలు అన్నరీతిలో సాగడం గమనార్హం. కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్న దేవాదుల పధకం అమలు సాధ్యం కాదని తేల్చేశారు. సాగునీటి మంత్రి ప్రమేయం లేకుండా అటువంటి వాదనలను ఇంజినీర్లు మంత్రుల బృందం ముందుంచుతారా? అంతా ఆగమ్యగోచరంగా మారింది.