బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం

రాజకీయ చైతన్యానికి, విద్యావంతులైన జనాభాకు పేరొందిన బెంగళూరు నగరంలో దాదాపు సగం మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఓవైపు 90ఏళ్లు పైబడిన వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తూ  ఉదయాన్నే పోలింగ్​ కేంద్రాలకు చేరుకుంటున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఇలా నగరాల్లోని ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించకపోవడం చర్చకు దారితీస్తోంది.

కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో శుక్రావారం 69.23 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే బెంగళూరులోని మూడు కీలక నియోజకవర్గాలైన  బెంగుళూరు సెంట్రల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్​లలో ఓటింగ్ శాతం మొత్తం రాష్ట్ర సగటు కంటే తక్కువగా నమోదైంది. కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో 69.23 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ, ఈ మూడు పట్టణ ప్రాంతాల్లో తక్కువ శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ లోక్​సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్​లో 52.81 శాతం, బెంగళూరు నార్త్​లో 54.42 శాతం, బెంగళూరు సౌత్​లో 53.15 శాతం పోలింగ్ నమోదైంది. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఇదే బెంగళూరు సెంట్రల్లో 54.32 శాతం, బెంగళూరు నార్త్​లో 54.76 శాతం, బెంగళూరు సౌత్లో 53.70 శాతం పోలింగ్ నమోదైంది. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఇంకా తక్కువ  పోలింగ్ శాతం నమోదైనట్టు వెల్లడవుతుంది. పైగా.. ప్రతిసారి ఇదే పరిస్థితులు కనిపిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.

ఓటు హక్కు విషయంపై ఎంత అవగాహన కల్పించినా, ఎంత తీవ్రంగా ప్రచారాలు చేసినా, ఓటర్ల ఉదాసీనత కొనసాగడంపై ఎన్నికల సంఘం అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే  తీవ్రమైన ఎండలు తక్కువ పోలింగ్ కు ఓ కారణంగా భావిస్తున్నారు. అదే బెంగళూరు రూరల్​లో 67.29 శాతం పోలింగ్ నమోదైంది. మాండ్యలో 81.48 శాతం, కోలార్ లో 78.07 శాతం పోలింగ్ నమోదైంది.

ఈ ఎన్నికల సందర్భంగా పట్టణ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కర్ణాటక ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. వివిధ యాప్​ల వాడకాన్ని ప్రోత్సహించడం, ఓటర్లు పోలింగ్ బూత్లను గుర్తించడంలో సహాయపడటానికి ఓటరు స్లిప్పులపై క్యూఆర్ కోడ్లను జోడించడం వంటి చర్యలు తీసుకుంది.

బెంగళూరులోని పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లు, పార్కింగ్ సౌకర్యాల గురించి సమాచారం అందించడంతో పాటు విస్తృతమైన బూత్ ఎన్నికల నిర్వహణ ప్రణాళికను సైతం అందించింది. కానీ ఓటర్లు వచ్చి ఓటు వేయలేదు!

ఓటింగ్​ ప్రక్రియను సులభతరం చేసే చర్యల్లో భాగంగా ఓటర్ హెల్ప్​లైన్, ‘నో యువర్ క్యాండిడేట్’ యాప్​లను కూడా ఎన్నికల సంఘం ఉపయోగించింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, గత లోక్​సభ ఎన్నికల్లో చారిత్రాత్మకంగా తక్కువ పోలింగ్ నమోదైన ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేల ఫీడ్​బ్యాక్​ ఆధారంగా ఎన్నికల సంఘం పట్టణ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను మెరుగు పరిచింది. 

గతంలో ఓటర్ల భాగస్వామ్యాన్ని నిరుత్సాహపరిచిన కొన్ని కీలక సమస్యలను పరిష్కరిస్తూ ఓటింగ్​ను మరింత అందుబాటులోకి తీసుకురావడం, సమర్థవంతంగా నిర్వహించడం ఈ కార్యక్రమాల లక్ష్యం. అయినా.. ఫలితం దక్కలేదు!