రాజ్యాంగబద్ధ పాలనకై పోరాడిన పార్టీపైనా దుష్ప్రచారం!?

ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్

ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారత్ ఉజ్జ్వలశక్తిగా దూసుకెళుతున్న ప్రస్తుత తరుణంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో ఏ రంగాన్ని చూసినా వృద్ధి రేటు నమోదు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీయే మళ్లీ అధికారం చేపడితే అడ్రస్ గల్లంతవుతుందనే భయంతో కాంగ్రెస్ సహా ఇండీ కూటమిలోని పలు పార్టీలు కుట్రపన్ని కుహనా నినాదాన్ని ఎత్తుకున్నాయి. 

అదేమిటంటే మళ్లీ అధికారంలోకి వస్తే నేటి రాజ్యాంగాన్ని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందనే దుష్ప్రచారం. చరిత్ర పుటల్లోకి వెళితే ఇదెంత అవాస్తవమో స్పష్టమవుతుంది. ముందుగా రాజ్యాంగం రద్దు అనే అంశానికి వద్దాం. అసలు ఇది సాధ్యమేనా? గత బీజేపీ ప్రభుత్వాలు గాని, సంఘ్ పరివార్ గాని ఏనాడైనా కనీసం ఈ దిశగా వ్యాఖ్యలైనా చేశాయా?

 అన్నిటికంటే హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే- దేశంలో 1975–77 మధ్య కాలంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ విలువలను పూర్తిగా తుంగలో తొక్కి, పత్రికా స్వేచ్ఛను హరించి, విపక్ష నేతల్ని ఎడాపెడా అరెస్టులు చేయించి జైళ్లను నింపేసిన ఘనత నాటి ప్రధాని ఇందిరాగాంధీ సర్కారుదేనని యావత్ ప్రపంచానికి తెలుసు.

 నాడు ఎమర్జెన్సీని తొలగించి, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు రాజ్యాంగబద్ధ పాలన కోసం 80 వేలకు పైగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు జైళ్లకు వెళ్లారు. ఇప్పుడు ఇందిర వారసులైన కాంగ్రెస్ అగ్రనేతలు, వీరితో భాగస్వామ్యంలో ఉన్న ఇండీ కూటమి నేతలు రాజ్యాంగం రద్దు గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాల్ని వల్లించడమే.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో పరిపాలనకు ఆత్మ రాజ్యాంగమే. రాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రిమండళ్లు, గవర్నర్లు, న్యాయమూర్తులు, ఎన్నికల ప్రక్రియ, సైనిక దళాలు సహా చట్టబద్ధమైన పలు సంస్థల ఏర్పాటు అంతటికీ రాజ్యాంగమే ఆధారం. ఈ రాజ్యాంగమే ఊపిరిగా బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటు, నేతల ఎన్నిక జరిగింది. 

ఈ రాజ్యాంగం ప్రాతిపదికనే గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి సర్కారు, గత రెండు విడతలుగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడి రాజ్యాంగబద్ధంగా సర్కారును నడుపుతూ ప్రజాదరణ పొందాయి. ఇంత అవకాశాన్నిచ్చిన రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చెయ్యాలనుకుంటోందనే ప్రచారం ఎంతవరకూ నిజమో ఈ గాలిమాటలకి ఊపిరి పోసిన ఇండీ నేతలే చెప్పాలి. 

దేశంలో రాష్ట్రపతుల్ని, న్యాయమూర్తులను, ప్రభుత్వాలను అభిశంసించాలంటేనే ఎన్నో కోణాలను దృష్టిలో పెట్టుకుని పలు సంక్లిష్టమైన ప్రక్రియలను రాజ్యాంగం నిర్దేశించడంతో పాటు ప్రభుత్వాలు తప్పుదోవ పట్టకుండా గవర్నర్లు, రాష్ట్రపతులను రాజ్యాంగ రక్షకులుగా మన ప్రజాస్వామ్యం ఉంచింది. ఇంత పటిష్టమైన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ఎప్పుడూ గౌరవిస్తూనే ఉండగా ‘రాజ్యాంగం రద్దు’ అనే మాట బీజేపీకి అన్వయించడం పూర్తి దురుద్దేశపూరితం తప్ప మరొకటి కాదు.

ఒకవైపు రాజ్యాంగం రద్దు అంటూనే, రాజ్యాంగాన్ని బీజేపీ మార్చేయబోతోందనే అనే మరో మాటను కూడా విపక్షాలు ప్రయోగిస్తున్నాయి. అసలు రాజ్యాంగాన్ని 100 సార్లకు పైగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే! ఎంతమాత్రమూ మార్పులకు వీల్లేని రాజ్యాంగ పీఠికను ఎమర్జెన్సీలో మార్చింది కాంగ్రెస్ సర్కారు కాదా? కాంగ్రెస్ పాలనలో జరిగిన రాజ్యాంగ మార్పులను ఏమంటారు? ఇది రాజ్యాంగాన్ని మార్చడం కాదా? 

రాజ్యాంగంలో సవరణలు, చట్టాల రూపకల్పన, మార్పుచేర్పులకు సంబంధించి రాజ్యాంగమే నిర్దిష్ట విధి విధానాలతో అవకాశమిచ్చినప్పుడు రాజ్యాంగంలో మార్పులు చెయ్యడం మహా నేరమన్నట్టు విపక్షాలు ప్రచారం చెయ్యడం సబబేనా? అదే వారి మాట అయితే రాజ్యాంగ మార్పుల విషయంలో మొదటి దోషిగా కాంగ్రెస్‌నే నిలబెట్టాలి.

ఇక ఎస్సీ–ఎస్టీ రిజర్వేషన్ల రద్దు అంశానికి వస్తే– బీజేపీపైన, ఆర్ఎస్ఎస్ పైనా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి అదే నిజమని అనిపించేందుకు విపక్షాలు చేస్తున్న విశ్వప్రయత్నం ఇది. కోల్పోతున్న తమ ప్రాభవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిపక్షాలు చేస్తున్న ఈ దింపుడుకళ్ళెం ప్రయత్నం వారికి నిరాశనే మిగల్చుతుందనేది ఇప్పటికే రుజువైన సత్యం.

 రిజర్వేషన్లకి సంబంధించి ‘కొన్ని శతాబ్దాలుగా ఎస్సీలపై చూపిన అస్పృశ్యత నిర్మూలనకు ఉద్దేశించిన ఈ రిజర్వేషన్లు అస్పృశ్యత, అసమానతలు ఉన్నంతవరకు కొనసాగాలి. మేము అభివృద్ధి చెందాం, మాకు ఇక రిజర్వేషన్లు అవసరం లేదని ఎస్సీ, ఎస్టీలు ప్రకటించేంత వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కొనసాగాలి’ అన్నది ఆర్ఎస్ఎస్ నిశ్చితాభిప్రాయం. 

ఆర్ఎస్ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ సహా పలువురు ముఖ్య నేతలు ఈ విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి 2015 నుంచి 2024 ఏప్రిల్ వరకూ వివిధ సందర్భాల్లో రిజర్వేషన్లకు మద్దతుగా ఆర్ఎస్ఎస్ పెద్దలు చేసిన వ్యాఖ్యల వీడియోలు కూడా బయటకొచ్చాయి. 

రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, సంఘ్ పరివార్ చిత్తశుద్ధికి ఇంకేం రుజువు కావాలి? కానీ, రిజర్వేషన్లపై అంతకుముందెప్పుడో ఆర్ఎస్ఎస్ నేతల నుంచి భిన్నమైన వ్యాఖ్యలు వినిపించాయని రాహుల్‌గాంధీ కుమిలిపోతున్నారు. ఆయనకు వినిపించిన ఆ వ్యాఖ్యలు ప్రజలకు వినిపించలేదంటే ఎవరిది లోపమో ఆయనే చెప్పాలి.

ఎస్సీ ఎస్టీల విషయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎప్పుడూ ఉన్నతమైన దృష్టితోనే వ్యవహరించాయి అని చెప్పడానికి ఆర్ఎస్ఎస్ శాఖలను సందర్శించి, బడుగువర్గాలకు అక్కడ దక్కిన ఆదరణ చూచి ప్రశంసలు కురిపించిన మహాత్మా గాంధీజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ల వ్యాఖ్యలే చాలు. 

మే 12, 1939న పూణే నగరంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల శిబిరానికి డాక్టర్ అంబేడ్కర్ విచ్చేసిన ఉదంతం, అక్కడ ఆచరణలో ఉన్న కులనిర్మూలన తీరును అంబేడ్కర్ మెచ్చిన వైనాన్ని ఆయన అనుయాయి బాలా సాహెబ్ సాలుంకే (1957–62 లోక్‌సభ సభ్యులు) తన ఆత్మకథలో తెలిపారు, 1957 ఏప్రిల్ 1, 1957న పూణేలో జరిగిన ఉగాది వేడుకల్లో బహిరంగంగానూ చెప్పారు. 

ఇక గాంధీజీ 28 సెప్టెంబర్ 1947లో వార్ధాలో ఆర్ఎస్ఎస్ శాఖకు విచ్చేసి తాను కోరుకున్న కులరహిత సమాజం ఆర్ఎస్ఎస్ శాఖల్లో కనిపించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలపై కువిమర్శలే ఊపిరిగా బతుకీడుస్తున్న విపక్ష నేతలకు కళ్లెదుట ఈ సాక్ష్యాలు కనిపిస్తున్నా గుడ్డితనాన్ని నటిస్తూ అందరూ తమలాగే ఉండాలని కోరుకుంటున్నారు.

డాక్టర్ అంబేడ్కర్ జీవించి ఉండగా వారి సిద్ధాంతాలను కమ్యూనిస్టులు వెక్కిరిస్తూనే ఉన్నారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండా నాటి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. బీజేపీని విమర్శించేందుకు పదేపదే డాక్టర్ అంబేడ్కర్‌ని అడ్డుపెట్టుకునే వామపక్ష మేధావులు గుర్తించాల్సిన సత్యం మరొకటుంది. డాక్టర్ అంబేడ్కర్ పలు సందర్భాల్లో కమ్యూనిస్టుల తీరును తుర్పారబట్టారు. 

తెలుగు రాష్ట్రాలలో నక్సల్ ఉద్యమానికి మూలపురుషుడైన నల్ల సూరీడు సత్యమూర్తి ఏమన్నారు? నక్సల్ ఉద్యమంలో కూడా క్రింది స్థాయిలో పోరాటం చేస్తున్నవారు, చనిపోతున్నవారు ఎస్సీ ఎస్టీ వర్గాల వారేనని, పై నాయకత్వం మాత్రం అగ్రవర్ణాల వారిదని చెప్పలేదా? నిమ్న, పేద వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే కమ్యూనిస్టు పార్టీల పోలిట్‌ బ్యూరోలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉన్నారని ఆనాడే ప్రశ్నించారు.

అంబేడ్కర్ భావజాలానికి వ్యతిరేకంగా, భారతదేశం ఒకటి కాదని, ఆర్యులు బయటవారనీ… వీరు ఈ దేశంలోని మూలవాసులపై దాడులు చేశారని అసత్య ప్రచారం ఇప్పటికీ చేస్తున్నది కమ్యూనిస్టులు కాదా? జవాబులివ్వలేని ఎన్నో ప్రశ్నలను దాచుకున్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలా బీజేపీనీ, ఆర్ఎస్ఎస్‌నీ విమర్శించేది?

(ఆంధ్రజ్యోతి నుండి)