పత్తాలేని బిఆర్ఎస్…కాంగ్రెస్‌కు ఓటమి ఖాయం

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి ఖాయమని, బిఆర్ఎస్ పత్తా లేదని,  ప్రజలు ఎన్డీఏ వైపు నిలుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ దేశంలోని అన్ని వ్యవస్థలను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అని, ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

గత రెండు పర్యాయాలు ఓటేసి తనకు ప్రధానిగా అవకాశం ఇస్తే దేశానికి సేవ చేశానని,  దేశ భద్రతే తమకు తొలి ప్రాధాన్యమని తెలిపారు. అయితే,  వంశపారంపర్య వ్యవస్థకు కేరాఫ్ కాంగ్రెస్ అంటూ  పీవీ నరసింహారావును కూడా అవమానించిన దరిద్రపు పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం పీవీ నరసింహారావుకు భారతరత్నతో అరుదైన గౌరవం అందించిందని గుర్తు చేశారు. 

కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకటేనని అలాంటి పార్టీలకు ప్రజలు ఓటు వేయద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలను తెలంగాణ నుండి తరిమికొట్టాలని ప్రధాని పిలుపిచ్చారు. కిసాన్ సమ్మాన్ రైతులను ఆర్థికంగా ఆదుకున్నామన్నారు.

కాంగ్రెస్​, బీఆర్​ఎస్​లు ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు, తెర వెనుక మాత్రం అవినీతి సిండికేట్​ చేస్తారని ప్రధాని మోదీ ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హంగామా చేసిందని, అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.  ​

రెండూ అవినీతి పార్టీలేనన్న మోదీ వాటిని అవినీతే అనుసంధానం చేస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని రెండు పార్టీలు కాలరాశాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడితే ప్రజల కలలు సాకారమవుతాయని అందరూ భావించారని కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టుపెట్టి కుటుంబ లబ్ధి కోసమే బీఆర్​ఎస్​ పని చేసిందని విమర్శించారు.

తెలంగాణలో డబుల్ ఆర్ టాక్సీ వసూలు చేసిందని, త్రిబుల్ ఆర్ కలెక్షన్లను మించి వసూలు చేసిందని ఆరోపించారు. తెలంగాణలో ఒక ఆర్ అక్రమంగా వసూళ్లకు పాల్పడి ఢిల్లీలో మరో ఆర్ కు అందిస్తున్నారని విమర్శించారు.  ఇప్పటివరకు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయని, మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమే కలుగుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన నాలుగు విడతల్లోనూ బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని చెప్పారు. 

కరీంనగర్​లో బండి సంజయ్ ​ విజయం ముందే నిర్ణయమైందని జోస్యం చెప్పారు. ఈ నియోజకవర్గంలో ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్​ బరిలోకి దింపినప్పుడే కరీంనగర్​లో​ పార్టీ ఓటమి ఖాయమైందని వ్యాఖ్యానించారు. బీఆర్​ఎస్​ ప్రభావం కరీంనగర్​లో మచ్చుకైనా కనిపించట్లేదని పేర్కొన్నారు.

“ప్రజల ఓటు వల్లే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్​ అవతరించింది. కాంగ్రెస్​ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. పదేళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి లాభసాటిగా మార్చాం. వ్యవసాయ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించాం. టెక్స్​టైల్​ పార్కులు ఏర్పాటు చేశాం. రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నాం” అని తెలిపారు.

కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ని మరోసారి భారీ మేజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తోపాటు బిజెపి ప్రజాప్రతినిధులు నాయకుల తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.