కేజ్రీవాల్ నిరసన పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్తత

కేజ్రీవాల్ నిరసన పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్తత
దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలోని బిజెపి పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా వెల్లేందుకు ఆప్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. శనివారం సీఎం కేజ్రీవాల్ పిఎను పోలీసులు అరెస్టు చేయడంతో నగరంలోని బిజెపి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆయన పిలుపునిచ్చారు.

 బిజెపి ఆఫీస్ వస్తామని.. ఇష్టమొచ్చిన వారిని జైల్లో పెట్టండని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఆదివారం పెద్ద ఎత్తున ఆప్ నాయకులు, కార్యకర్తలు ఆప్ ప్రధాన కార్యాలయానికి తరలివచ్చారు. సిఎం కేజ్రీవాల్, మంత్రులతో సహా ఆప్ నాయకులు, కార్యకర్తలు  బిజెపి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా వెళ్తుండగా  అక్కడే పోలీసులు అడ్డుకున్నారు.  

దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్, ఇతర నేతలు ఆప్‌ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆప్​ ఆందోళన పిలుపుతో డిల్లీలోని పండిట్ దిన్​దయాల్ ఉపాధ్యాయ మార్గ్‌లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ఐటీవో మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 

ఆమ్‌ఆద్మీ పార్టీని అంతం చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని అరవింద్ కేజ్రీవాల్‌ ఆరోపించారు.  ఆప్ కార్యాలయం వద్ద కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీకి ఆప్​ భవిష్యత్తులో సవాలుగా మారుతుందన్న భయంతోనే ‘ఆపరేషన్‌ ఝాడు’ను ప్రారంభించిందని విమర్శించారు.   “భవిష్యత్తులో మన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారు. పార్టీ కార్యాలయాన్ని మూసి వేసి వీధుల్లోకి తీసుకొస్తారు. మున్ముందు మనకు పెద్ద సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండండి” అంటూ కేజ్రీవాల్ ప్రసంగించారు.

ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా, ఢిల్లీ మంత్రులు ఆతిషి మార్లేనా, సౌరభ్‌ భరద్వాజ్‌లు జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌ స్పందించారు. మనీశ్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్‌ సింగ్‌లను జైలుకు పంపినట్లుగానే మిగిలిన ఆప్‌ నేతలను కూడా జైలుకు పంపడమనే ఆటను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆడుతున్నారని ఆరోపించారు.

  మరోవైపు, బిజెపి కార్యాలయం వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మొహరించారు. భారీ గ్రేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీజేపీ కార్యలయానికి వచ్చిన ఆప్​ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ​ తలపెట్టిన నిరసనను ఉద్దేశించి​ ఎంపీ స్వాతీ మాలీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ఒకప్పుడు నిర్భయకు న్యాయం చేయాలని మనమంతా వీధుల్లోకి వచ్చాం. 12 ఏళ్ల తర్వాత ఈరోజు సీసీటీవీ ఫుటేజీని మాయం చేసి, ఫోన్‌ను ఫార్మాట్‌ చేసిన నిందితుణ్ని కాపాడేందుకు వీధుల్లోకి వస్తున్నామా?” అంటూ ఆమె ఎద్దేవా చేశారు.

ఇక బిభవ్ కుమార్‌ను అరెస్ట్ చేసినపుడు చూపించిన ఈ ఉత్సాహం.. ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయినపుడు చూపించి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని స్వాతి మలివాల్‌ పేర్కొన్నారు. మనీష్ సిసోడియా ప్రస్తుతం జైల్లో కాకుండా బయట ఉంటే తనకు ఇవాళ ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు.