మేడిగడ్డను పరిశీలించిన జస్టిస్ ఘోష్

కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన న్యాయ విచారణలో భాగంగా జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, ఇరిగేషన్ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్‌కు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్‌పి కిరణ్ ఖరే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. 

ఎక్కువగా కుంగిన 20వ నంబరు పిల్లర్, పాక్షికంగా కుంగిన 19, 21వ నెంబర్ పిల్లర్లను అధికారులు, నిపుణుల బృందం పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీపై 7వ బ్లాక్‌లో వంతెనపై కాలినడకన సాగుతూ అణువణువునా పరిశీలించారు. 7వ బ్లాక్‌లో 20వ పిల్లర్ దెబ్బతిన్న ప్రాంతాన్ని చూసి అధికారుల నుంచి వివరాలను సేకరించారు. 

బ్యారేజీ దిగువకు చేరుకొని 19, 20, 21వ పిల్లర్లను పరిశీలించారు. పిల్లర్ల్ల కింది భాగంలో వచ్చిన పగుళ్లను నిశితంగా పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పిల్లర్ల్ల కుంగుబాటు పై పలు అంశాలపై అధికారుల ద్వారా వివరాలను సేకరించారు. 

ఈ సందర్భంగా జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ చంద్రఘోష్ మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయి లో కమిషన్ పర్యటిస్తోందని, ఇరిగేషన్ శాఖ నిపుణులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించామని తెలిపారు. తమ పరిశీలనలో వెలుగులోకి వచ్చిన విషయాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు.