మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే

దేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ విమర్శించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగాన్ని మార్చి సెక్యులర్ పదం ఎందుకు చేర్చాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

 ఫిరోజ్ గాంధీ సమయంలో దేశాన్ని మూడు ముక్కలు చేశారని పేర్కొంటూ ఈ విషయంపై తాను రెండేళ్ల క్రితం మాట్లాడిన వీడియోపై ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వీడియోను మార్చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో యూనివర్సిటీల స్టేటస్లు తీసేసి మైనార్టీ కళాశాలగా మార్చారని గుర్తు చేశారు.

అనంతరం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేసి వారు విశ్వవిద్యాలయాల్లో చదవకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. 2011లో సోనియాగాంధీ మరొక జామియా మిలియా సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ తీసేసి దానికి మైనారిటీ స్టేటస్ ఇచ్చి, అందులో ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజ్వరేషన్ తీసేసినట్లు అరవింద్ తెలిపారు. 

దీన్ని పార్లమెంట్లో స్పెషల్ చట్టం ద్వారా అమలు చేశారని గుర్తు చేశారు. దీంతో ఆ విశ్వవిద్యాలయంలో ఎవరూ చదవలేకపోయారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉస్మానియా, హైదరాబాద్ యూనివర్సిటీల పరిస్థితి ఇలా కాదని గ్యారంటీ ఏంటని బిజెపి నేత ప్రశ్నించారు.

“మొట్టమొదటి సారిగా దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తీసేసారు. ఇదంతా కేవలం ఓటు బ్యాంకు కోసం కాదా? రాజ్యాంగం ఉపోద్ఘాతం మార్చేసి, రాజకీయాల కోసం దేశాన్ని విభజించారు. రాజ్యాంగంలో ఉన్నసెక్యులర్ పదం వారే పెట్టారు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చింది ఉపోద్ఘాతం ఇవాళ హిందూ సమాజాన్ని పూర్తిగా కన్ఫ్యూజన్లో పెట్టేశారు” అంటూ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ముస్లింలను ఓబీసీలో కలిపేశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను నాశనం చేసి, వారి రిజర్వేషన్లను తీసేసి, దోచుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎందుకు బలి చేస్తున్నారని నిలదీశారు. ఇంకా ఎంత కాలం ఇలా చేస్తారని అడిగారు. ఈ ప్రశ్నలన్నింటీకి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.