అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకాయని హైదరాబాద్‌ ఐంఎండీ తెలిపింది. రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లోనూ సమయానుకూలంగా పురోగమించాయని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 19న భారత భూభాగాన్ని తాకాయి.

రుతుపవనాల పురోగతి, ప్రారంభాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ఐఎండీ కొన్ని ప్రమాణాలను అనుసరిస్తుంది. ఐఎండీ ప్రకారం.. దిగువ ట్రోపోస్పిరిక్‌ స్థాయిలో (3 కిలోమీటర్ల వరకు) కొలిచే పశ్చిమ గాలుల బలం దాదాపు 20 నాట్స్‌కి పెరిగింది. ఈ ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు నైరుతి గాలులు వీచాయి. మేఘాలు సైతం పెరిగాయి. 

ఈ ప్రాంతంలో అవుట్‌గోయింగ్ లాంగ్‌వేవ్ రేడియేషన్ చదరపు మీటరుకు 200 వాట్ల కంటే తక్కువగా ఉన్నది. గత 24 గంటల్లో నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆయా పరిస్థితులను పరిశీలిస్తే నైరుతి రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్‌లోకి ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది.

 రుతుపవనాలు ఈ నెల 31న కేరళను తాకుతాయని అంచనా వేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని వివరించింది. రుతుపవనాల సీజన్‌లో భారత్‌లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా మే 22 వరకు అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.

మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ, యానాంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 

సోమవారం, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆదివారం మధ్యా్హ్నాం ఉత్తర కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమై ఉంది.

మే 22 నుంచి 27 వరకు బలమైన తుపాను ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ నుంచి వైజాగ్ – పూరి వరకు కోస్తా తీరంపై తుపాన్ ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో మే 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

మే 24 నాటికి వాయుగుండం మారే అవకాశం ఉందన్నారు. వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకాయని, ఇవాళ మాల్దీవులుు, కోమరిన్‌ ప్రాంతంలో కొంతమేర, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, దక్షిణ అండమాన్‌ సముద్రంలోని కొంత మేర విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.