అస్పృశ్యత భావన సమాజాన్ని విభజిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ రామ్‌దత్ చక్రధర్ హెచ్చరించారు. తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన సంఘ్ మొదటి ‘కార్యకర్త వికాస్ వర్గ్’ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తూ మన దేశంలోని అనేకమంది గొప్ప రుషులు కేవలం తమ పుట్టుక వల్ల కాకుండా, తమ జ్ఞానం, ఆధ్యాత్మికత వల్ల ప్రసిద్ధి చెందారని తెలిపారు.
‘ఏక సహ-సంపత్’ (అందరూ సమాన సంపదకు వారసులే) అనే విధానం ద్వారా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పుట్టుక ఆధారంగా కాకుండా సమాజంలోని అన్ని కులాలను ఏకం చేయడానికి కృషి చేసిందని తెలిపారు. వార్ధాలోని సంఘ్ శిబిరంలో స్వయంసేవకులందరూ ఎటువంటి కుల భేదాలు లేకుండా హిందువులుగా కలిసి జీవించడం చూసి మహాత్మా గాంధీ ఎంతో ప్రభావితమయ్యారని చెప్పారు.
సంఘ్ ఒక సైద్ధాంతిక ఉద్యమం అని, ఈ దేశం హిందూ సమాజానికి చెందినదని సంఘ్ స్పష్టంగా పేర్కొందని తెలిపారు. హిందువులు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందిని, హిందువులు బలహీనంగా ఉంటే దేశం కూడా బలహీనంగా ఉంటుందని స్పష్టం చేశారు. హిందూ సమాజంలో ఆత్మ చైతన్యం కలిగించడానికి సంఘ్ కృషి చేసిందని చెప్పారు.
కొందరు వ్యక్తులు ప్రలోభపెట్టడం ద్వారా హిందూ సమాజాన్ని పద్ధతి ప్రకారం మత మార్పిడి చేస్తున్నారని పేర్కొంటూ దీనిని అడ్డుకోవాలని రామ్‌దత్ చక్రధర్ పిలుపిచ్చారు. దేశం పట్ల సానుకూల దృక్పథం కలిగిన ఉత్తమ వ్యక్తులతో కలిసి పనిచేస్తూ మనం దేశాన్ని ముందుకు నడిపించాలని కోరారు.
నేడు భారతదేశంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్ గవర్నర్ లార్డ్ కర్సన్, అశుతోష్ ముఖర్జీని విదేశాలకు వెళ్లమని కోరినప్పుడు, తన తల్లి అనుమతి లేకుండా వెళ్లలేనని ఆయన బదులిచ్చారని ఆయన గుర్తు చేశారు. “నీ తల్లి నాకంటే శక్తివంతురాలా?” అని కర్సన్ అడగగా, “అవును” అని ముఖర్జీ సమాధానమిచ్చారని, చివరకు తన తల్లి అనుమతి పొందిన తర్వాతే ఆయన విదేశాలకు వెళ్లారని తెలిపారు.
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా పి.హెచ్.డి. కంటే తన తల్లికి సేవ చేయడమే ముఖ్యమని భావించారని తెలిపారు. అస్పృశ్యత అనే భావన సమాజాన్ని విభజిస్తుందని ఆయన చెప్పారని తెలుపుతూ మన దేశంలోని ఎంతోమంది గొప్ప ఋషులు తమ జ్ఞానం ద్వారా ప్రఖ్యాతి గాంచారని వివరించారు.
డాక్టర్ హెడ్గేవార్ దృక్పథం
సంఘ్ స్థాపన సమయంలో, హిందూ సంఘటన కోసం డాక్టర్ హెడ్గేవార్ చేస్తున్న కృషిని ప్రజలు ఎగతాళి చేసేవారని, అది చాలా కష్టమైన పని అని భావించేవారని రామ్‌దత్ చక్రధర్ తెలిపారు. భారతదేశం హిందూ దేశమని ఎవరు చెప్పారని ప్రజలు ఎద్దేవా చేస్తూ అడిగినప్పుడు, డాక్టర్ సాహెబ్ “భారతదేశం హిందూ దేశమని నేను, కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, చెబుతున్నాను” అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పేవారని గుర్తు చేశారు.
దేశ సమాజం స్వార్థపూరితంగా మారిపోయిందని డాక్టర్ హెడ్గేవార్ గుర్తించారని, స్వార్థపూరిత హిందువులను సమాజ హితం కోరేవారిగా మార్చడానికి ఆయన ‘శాఖ’ (రోజువారీ సమావేశం) ద్వారా కృషి చేశారని తెలిపారు. ఆయన రోజువారీగా నిర్వహించే శాఖ వ్యవస్థను రూపొందించారని పేర్కొంటూ సంఘ్ నిర్వహించే ఈ శాఖ ఉత్తమ నడవడిక గల హిందువులను తయారు చేయడానికి పనిచేస్తుందని చెప్పారు.
ఒక ఉదాహరణ ఇస్తూ, గొర్రెలు, మేకల మధ్య పెరిగిన ఒక సింహపు పిల్ల వాటిలాగే తయారైందని, ఒకరోజు అడవిలో ఒక సింహం దాని మెడ పట్టుకుని, తమతో ఎలా జీవిస్తున్నావని అడిగిందని, ఆ తర్వాత, నీటిలో దాని ముఖం చూపించి, గర్జించేలా చేసి, తన నిజస్వరూపాన్ని తెలుసుకునేలా చేసిందని వివరించారు.
2026వ సంవత్సరం అత్యంత కీలకం
2026వ సంవత్సరం అత్యంత కీలకమైనదని రామ్‌దత్ చక్రధర్ పేర్కొన్నారు. ఎందుకంటే సరిగ్గా 150 ఏళ్ల క్రితం జన్మించిన బిర్సా ముండా (మతం,సంస్కృతి కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు) 150వ జయంతి ఈ సంవత్సరమే వస్తుందని, అలాగే, గురు తేగ్ బహదూర్ బలిదానానికి 350 ఏళ్లు, జాతీయ గీతం ‘వందేమాతరం’కు 150 ఏళ్లు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు కూడా ఆ సంవత్సరమే జరగనున్నాయని వివరించారు.
మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారని, ఆ ఘటనలో తమ ప్రమేయాన్ని నిరూపించాలని ఆర్‌ఎస్‌ఎస్ డిమాండ్ చేసిందని, లక్షలాది మంది కార్యకర్తలు ఈ నిషేధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపడంతో చివరికి నిషేధాన్ని ఎత్తివేశారని రామ్‌దత్ చక్రధర్ గుర్తు చేశారు.
అదేవిధంగా, ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని ప్రకటించి, ఆమె అత్యవసర పరిస్థితిని విధించడంతో, ఆర్‌ఎస్‌ఎస్‌ను మళ్లీ నిషేధించారని, చాలా మంది ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ లు 18 నెలల పాటు జైలులో ఉన్నారని తెలిపారు. నిరసనలు, ఆందోళనల తర్వాత నిషేధాన్ని ఎత్తివేశారని చెప్పారు. నేడు, ‘జాయిన్ ఆర్‌ఎస్‌ఎస్’ ద్వారా ప్రతి నెలా సుమారు 38 వేల మంది సంఘ్‌లో చేరుతున్నారని వివరించారు.
శీల ప్రాధాన్య సమాజం, జాతీయ చైతన్యం
స్వార్థమనే ముసుగును తొలగించి దేశంతో నిలబడే పౌరులు మాత్రమే దేశాన్ని గొప్పగా చేయగలరని డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం అనేవారని తెలిపారు. “ప్రతి గ్రామానికి సద్గుణవంతులైన, సున్నితమైన నాయకులు ఉండాలి” అని రవీంద్రనాథ్ టాగోర్ అన్నారని చెప్పారు. డాక్టర్ హెడ్గేవార్ ప్రతి గ్రామానికి శాఖలను విస్తరిస్తూ ఈ మిషన్‌ను చేపట్టారని తెలిపారు.
స్వామి వివేకానంద, “మనం హిందువులమని గర్వంగా చెప్పండి” అని చెబుతూ హిందువు అనే పేరు మీకు శక్తినిచ్చినప్పుడు, మీరు హిందువు అని పిలవబడటానికి అర్హులని తెలిపారు. ప్రపంచంలో ఏ ఒక్క హిందువు పడే బాధనైనా చూసి, దానిని తన సొంత బాధగా భావించినప్పుడే ఒక వ్యక్తి నిజమైన హిందువు అవుతాడని స్పష్టం చేశారు.
పర్యావరణ పరిరక్షణ, భారతీయ విలువలు
మొక్కలు ఆక్సిజన్‌ను అందించి మన జీవితాలను సురక్షితంగా ఉంచుతాయని, అందువల్ల పర్యావరణాన్ని పరిరక్షించడం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. విదేశీ పండితులు కూడా భారతదేశం నుండి పర్యావరణం గురించి నేర్చుకోవాలని చెబుతుంటారని తెలిపారు.
మన ప్రవర్తన, మన నూతన సంవత్సరం, మన పుట్టినరోజులు, మన ఆహారం, మన అభివృద్ధి అన్నీ భారతీయ విలువలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. శిక్షణ అనంతరం, కార్యకర్తలు తమతమ కార్యక్షేత్రాలకు వెళ్లి, నూతన శక్తి, ఉత్సాహంతో సంఘ్ కార్యకలాపాలను విస్తరించి, సామాజిక జీవితంలో చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు.
జాతి నిర్మాణ యజ్ఞంలో చేసిన త్యాగానికి ప్రతిరూపం
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆవిష్కర్త, ప్రగతిశీల రైతు పద్మశ్రీ రామ్‌శరణ్ వర్మ మాట్లాడుతూ, ఇది కేవలం ఒక శిక్షణా తరగతి ముగింపు కాదని, జాతి నిర్మాణ యజ్ఞంలో సమర్పించిన ఒక కానుకకు ప్రతిరూపమని చెప్పారు. సమాజంలో ఎక్కడ విభజన ఉన్నా, అక్కడ ఐక్యతను తీసుకురావడం ఇక్కడ శిక్షణ పొందిన స్వయంసేవక్ ల కర్తవ్యం అని స్పష్టం చేశారు.
దేశం, మతం, సంస్కృతిని పరిరక్షించే బాధ్యతను వాలంటీర్లు నెరవేరుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 289 మంది వాలంటీర్లు 20 రోజుల శిక్షణ పొందారు.సంఘ్ యొక్క పంచ పరివర్తన్ చొరవ కింద జరుగుతున్న కుటుంబ చైతన్య కార్యక్రమాల స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశంగా ఉపయోగపడింది.

More Stories
రాజ్యసభకు మూడో టీఎంసీ ఎంపీ రాజీనామా
కాంగ్రెస్ ద్రోహంతో దెబ్బతిన్న ప్రజలు ఎన్‌డిఎపై ఆశలు
`కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం’ సోనియా సూచించారని కధనాలు!