25 నుంచి అమెరికా, కెనాడా, యుకెలలో మోహన్ భగవత్ పర్యటన 

25 నుంచి అమెరికా, కెనాడా, యుకెలలో మోహన్ భగవత్ పర్యటన 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా, సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ఆగస్టు 25 నుంచి అమెరికా, కెనడా, యుకెలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించిన “సంపర్క్ అభియాన్” (ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమం)లో ఒక భాగం. 

ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ట్వీట్ చేస్తూ, “విదేశాల్లోని స్థానిక సంఘాలు, సంస్థల ఆహ్వానం మేరకు, సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ 2026 ఆగస్టు 25 నుండి అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల కాలంలో జరుగుతుండటం విశేషం,” అని పేర్కొన్నారు. 

ఈ పర్యటనలో భాగంగా, 28న రక్షాబంధన్ సందర్భంగా ‘ఎహెడ్ ఫోరమ్’ (అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్) న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ భగవత్ ప్రసంగించనున్నారు.  ఆగస్టు ఆయన పర్యటన వివరాలు మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తదుపరి దశలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ చొరవ ద్వారా, విదేశాలలో నివసిస్తున్న భారతీయులతో పాటు అంతర్జాతీయ సామాజిక, సాంస్కృతిక, విద్యా, పరిశోధనా సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని సంస్థ యోచిస్తోంది.   అమెరికా, కెనడాలలోని భారతీయ మూలాలున్న ప్రజలు, పరిశోధనా సంస్థలు, సామాజిక బృందాలు, సాంస్కృతిక సంస్థల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

ఆర్ఎస్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం, భగవత్ ప్రసంగం పరస్పర అనుసంధానం, సామాజిక సామరస్యం, విశ్వమానవ సౌభ్రాతృత్వం, ఐక్యత వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది.  శతాబ్ది ఉత్సవాల సమయంలో సంఘ్ చేపట్టిన ప్రపంచవ్యాప్త ప్రచార ప్రయత్నాలలో ఈ అమెరికా పర్యటన ఒక కీలక ఘట్టంగా నిలవనుంది. అమెరికాలో తన కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత, భగవత్ కెనడాలో పర్యటిస్తారు.

ప్రణాళిక ప్రకారం ఈ పర్యటన జరిగితే, ఆర్ఎస్ఎస్ అధినేతగా ఆ దేశంలో ఆయన చేసే మొదటి పర్యటన ఇదే అవుతుంది.  కెనడా పర్యటన ముగిసిన తర్వాత ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌లో కూడా పర్యటించనున్నారు. ఆర్ఎస్ఎస్ అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాలలో భాగంగా, భగవత్ గతంలో 2016లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో, 2018లో అమెరికాలోని చికాగోలో, 2023లో థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. 

ఇటీవల, విదేశీ జీవనశైలిని లోతుగా ఆలోచించకుండా అనుసరించడం కంటే, భారతదేశ ప్రజలు దేశ సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా జీవించాలని భగవత్ పేర్కొన్నారు.  కాగా, అంతకుముందు 2026 ఏప్రిల్‌లో, ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ  దత్తాత్రేయ హోసబలే శతాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా యుకె, అమెరికా, జర్మనీలలో పది రోజుల పాటు పర్యటించారు. 

అమెరికా పర్యటనలో భాగంగా, స్టాన్‌ఫోర్డ్‌లో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ సదస్సులోనూ, వర్జీనియాలో భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ ప్రముఖులతో జరిగిన సమావేశంలోనూ దత్తాజీ పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక సంస్థలు, ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంచుకోవడానికి, అలాగే అటువంటి వ్యక్తులను కలవడానికి సంఘ్ ఆసక్తి చూపుతోందనే విషయాన్ని ఆయన పర్యటన సూచించింది.