* ఈ కధనాలు ఖండించిన కాంగ్రెస్, టిఎంసి
పదిహేనేళ్లపాటు పశ్చిమ బెంగాల్ లో తిరుగులేని పరిపాలన సాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందడం, ఒకప్పటి తన సహచరుడే సువెందు అధికారి మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలిచిన బీజేపీ ప్రభుత్వంకు సారధ్యం వహిస్తుండడంతో అస్తిత్వ సమస్య ఎదుర్కొంటున్నది. ఇప్పటికే 58 మంది ఎమ్యెల్యేలు తిరుగుబాటు చేసి, తమను ప్రత్యేక గ్రూప్ గా గుర్తించాలని స్పీకర్ ను కోరారు. లోక్ సభలో 20 మంది పార్టీ ఎంపీలు సహితం అటువంటి తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.
రాజ్యసభలో ఇద్దరు సభ్యులు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. మమతకు రాజకీయ వారసుడిగా భావిస్తున్న ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలకు విసుగుచెంది తాము పార్టీకి దూరం అవుతున్నట్లు వారందరూ స్పష్టం చేస్తున్నారు. మరోవంక, అభిషేక్ వరుసగా పలు అవినీతి, అధికార దుర్వినియోగం కేసులలో నిందితుడిగా మారుతున్నారు. పలు దర్యాప్తు ఏజెన్సీలు ఆయనను వెంటాడుతున్నా యి.
ఇటువంటి పరిస్థితులలో కొంతకాలం గా దూరంగా ఉంటున్న ఇండియా కూటమి తాజాగా ఢిల్లీలో జరిపిన సమావేశంకు మమతా హాజరుకావడం, ఆ తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. కాంగ్రెస్ కు, ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నప్పటికీ మమతకు సోనియా గాంధీతో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితుల గురించి సోనియా, మమతా వివరంగా చర్చించారని, ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుండి బయటపడేందుకు టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయడమే మార్గం కాగలదని సోనియా సూచించారని మీడియా కధనాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ నుంచి ఎదురవుతున్న రాజకీయ ఒత్తిడిని తట్టుకునేందుకు, విపక్షాల ఉమ్మడి బలాన్ని పెంచే దిశగా సోనియా గాంధీ ఈ ప్రతిపాదన చేసినట్లు ఈ కధనాలు తెలుపుతున్నాయి.
టిఎంసిలో గ్రూపు రాజకీయాలు, పెరుగుతున్న అంతర్గత కలహాల నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సోనియా గాంధీ స్వయంగా మమతా బెనర్జీకి ఫోన్ చేసి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ ప్రతిపాదనపై వెంటనే ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా, ఆలోచించుకునేందుకు మమతా బెనర్జీ కొంత సమయం కోరినట్లు ఆ కధనాలు తెలిపాయి.
బెంగాల్ రాజకీయాలతోపాటు, జాతీయ రాజకీయాలపై కూడా చర్చించిన వారిద్దరూ ప్రధానంగా దేశంలో బిజెపి సాధిస్తున్న వరుస విజయాలు చర్చించారని చెబుతున్నారు. బెంగాల్లో బీజేపీ నేతల ఒత్తిడి కారణంగా టీఎంసీ నేతలు పార్టీని వీడుతున్నారని మమత సోనియాకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ టీఎంసీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని మమతను కోరారని తెలుస్తున్నది.
ఇదేసమయంలో అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ఇటీవల ముగిసిన బెంగాల్ ఎన్నికల ఫలితాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో టీఎంసీని విలీనం చేస్తే నాయకత్వం విషయంలో సహితం సోనియా స్పష్టమైన హామీలు ఆమెకు ఇచ్చారని చెబుతున్నారు.
టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేస్తే కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇస్తామని సోనియా హామీ ఇచ్చినట్లు, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కూడా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేందుకు అంగీకరించారని కధనాలు వెలువడ్డాయి. రెండు సంవత్సరాలుగా పార్లమెంట్ సమావేశాలలో సమిష్టి వ్యూహంపై మాత్రమే పరిమితమైన ఇండియా కూటమిని తిరిగి క్రియాశీలం చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సోనియా, మమతా భేటీ ప్రాధాన్యత ఆసక్తి కలిగిస్తున్నది.
అయితే కాంగ్రెస్లో తృణమూల్ కాంగ్రెస్ విలీనం కానుందనే ప్రచారాన్ని ఒక సీనియర్ టీఎంసీ నేత తోసిపుచ్చారు. వీటిని ఆధార రహితమైన వార్తలుగా అభివర్ణించారు. “విలీనం గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవాలు” అని తేల్చిచెప్పారు. అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ప్రచారాన్ని ఖండించింది.
కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమితో కలిసి పని చేసేందుకు టీఎంసీ ఇప్పటికే సంసిద్ధతను వ్యక్తం చేసింది. కాంగ్రెస్లో విలీనం కావడంపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జాతీయ స్థాయి రాజకీయ అవగాహనకు పశ్చిమ బెంగాల్ లో వామపక్ష ప్రభుత్వంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడటం లేదనే ఆగ్రహంతోనే గతంలో ఆ పార్టీని వదిలిపెట్టి మమతా బెనర్జీ టిఎంసిని నెలకొల్పారు. వామపక్ష ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటాలు జరిపి, అధికారంలోకి వచ్చారు.
ఇప్పుడు బెంగాల్ లో బీజేపీ ప్రబలమైన రాజకీయ శక్తిగా ఎదిగి అధికారంలోకి రావడం, మరోవంక కాంగ్రెస్, వామపక్షాలు రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకంగా మారడంతో బిజెపి ప్రభుత్వం సవాళ్ళను ఎదుర్కొనేందుకు మమతా తిరిగి కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

More Stories
కాంగ్రెస్ ద్రోహంతో దెబ్బతిన్న ప్రజలు ఎన్డిఎపై ఆశలు
`టాటా’ను బెంగాల్ కు పెట్టుబడులతో రప్పించడం తొలి ప్రాధాన్యత
సగం కన్నా తక్కువ ధరకు యూరియా దిగుమతి