కాంగ్రెస్ ద్రోహంతో దెబ్బతిన్న ప్రజలు ఎన్‌డిఎపై ఆశలు

కాంగ్రెస్ ద్రోహంతో దెబ్బతిన్న ప్రజలు ఎన్‌డిఎపై ఆశలు
కాంగ్రెస్ ద్రోహంతో దెబ్బతిన్న ప్రజలు ఎన్‌డిఎపై ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలు, నమ్మకాన్ని తాము వయ్ము చేయకుండా ముందుకు వెళ్లుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్‌డిఎ పరివార్ ప్రజలు పెంచుకున్న ఆశలు తెంచివేయకుండా సాగిందని చెబుతూ సగటు సామాన్య వ్యక్తికి మేలు జరిగిందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.
 
దేశంలో అత్యంత సుదీర్ఘ నిరంతర పాలనతో కూడిన ప్రభుత్వ రికార్డు నేపధ్యంలో ప్రధాని బుధవారం ఎన్‌డిఎ ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, నాయకులు భారత్ మండపంలో జరిపిన విజయాభినందన సభలో ప్రసంగిస్తూ  దేశంలో రాజకీయ సుస్థిరత అవసరాన్ని ప్రజానీకం గుర్తించిందని తెలిపారు.  స్థిరత్వంతో సుస్థిర ప్రభుత్వం తద్వారా సముచిత నిర్ణయాధికారం సంక్రమిస్తుందని, ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించారని వివరించారు.
తనకు ప్రజలే దేవుళ్లని, ఎన్నుకున్న ప్రజల మన్ననలే తనకు మిన్న అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిర్ణీత లక్షాలతో ముందుకు సాగేందుకు కలిసి వచ్చిన ఎన్‌డిలోని మిత్ర పక్షాలకు ధన్యవాదాలు అని చెప్పారు.  వారి భాగస్వామ్యంతో సాగుతున్నామని, ఇదే క్రమంలో వారి సహకారంతో లక్షాలు నెరవేర్చగల్గుతున్నామని తెలిపారు.  ఏ దేశ చరిత్ర చూసినా సుస్థిరత లేకుంటే దేశ ప్రగతి అసాధ్యం అవుతుందని, అరాచకం జన కంటకం అవుతుందని పేర్కొంటూ ఈ విషయాన్ని విజ్ఝులైన జనం గుర్తించారని తెలిపారు. 
 
ఇది కేవలం ఓ వ్యక్తికి లేదా ఓ పార్టీకి చెందినది కాదని, దేశంలో ప్రతి పౌరుడి సంకల్పం అయిందని తెలిపారు. ప్రజల కోసం ప్రజలతో సాగడమే ప్రజలు దీవించిన తమ ప్రభుత్వ ఆలోచనా విధానం అని స్పష్టం చేశారు. పలు అంతర్జాతీయ సవాళ్ల నడుమ జాతీయ స్థాయిలో స్థిరత అవసరం అని ప్రజలు తెలుసుకున్నారని పేర్కొన్నారు.  దీనితోనే తనకు ఇంతకాలం పాలన అందించే సదవకాశం కల్పించారని,  ఇది ఈ దేశ ప్రజల విజ్ఞత అని వివరించారు. 
 
“2014కు ముందు దేశంలో అస్థిరత్వం, ఆటుపోట్లు ఉంటూ వచ్చాయి. సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది.  దశాబ్దాల తరబడి ఇదే దుస్థితి ఉంటూ వచ్చింది” అని  గుర్తు చేశారు. కాంగ్రెస్ చాలాకాలంగా సాగించిన పాలనతో నెలకొన్న విష వలయాన్ని క్రమేపీ ఎన్‌డిఎ ఈ 12 ఏండ్లలో పూర్తిగా ఛేదించివేసిందని, ఇదే ఎన్‌డిఎ విజయం అని తెలిపారు.
 
గతంలో ఆర్టికల్ 370 అంటే అదేదో బ్రహ్మస్త్రంగా భ్రమింపచేశారని, అయితే తమ ప్రభుత్వం దీనిని రద్దు చేసిందని, ఇప్పుడు అక్కడ తలెత్తిన మార్పులను చవిచూస్తున్నామని గుర్తు చేశారు. అదే విధంగా దేశంలో ఉగ్రవాద దాడులతో తల్లడిల్లారని, ఇప్పుడు మనం ఉగ్రవాదుల ఏరివేతకు ముందుకు దూకుతున్నామని చెప్పారు. 
 
ఇక దేశంలోని మారుమూల ప్రాంతాలకు ప్రగతి ఫలాలు దరిచేరనివ్వని నక్సలిజం జోలికి వెళ్లకుండా గడిపారని, అయితే తమ హయాంలో నిర్ణీత గడువు ఖరారు చేసుకుని ఈ తీవ్ర సమస్యను నిర్మూలించగలిగామని తెలిపారు. నెలకొన్న సుస్థిరతతో వికసిత భారత్ లక్ష సాధనకు ముందుకు వెళ్లుతున్నామని , ఇందుకు అందరి సహకారం ఆనందదాయకం అని చెప్పారు. 
 
భారత్‌లో మార్పుల వైపు ఆసక్తిగా ప్రపంచ దేశాలు  
 
అనేక దేశాలు తమ సమస్యల పరిష్కారానికి భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కీలక రంగాలలో పరిణామాలు ఇప్పుడు పరిస్థితులను గుర్తించాలని ఆయన కోరారు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు పలు రంగాలలో జరిగాయని,  అభివృద్ధి కుంటుపడిందని చెబుతూ సుపరిపాలన క్రమంలో ఇప్పుడు దేశం ముందుకు సాగుతోందని తెలిపారు.  విద్యుత్ రహదారులు , రైల్వే, విమానయానంపై దృష్టిపెట్టామని వివరించారు.
గతంలో దేశవ్యాప్తంగా పాతిక కోట్లకు పరిమితం అయిన ఇంటర్నెట్ వాడకం, కేవలం సంపన్నులకు పరిమితం అయిన సాధనాసంపత్తిని విస్తరించామని, ఇప్పుడు దేశవ్యాప్తంగా వందకోట్లకు దాటి ఇంటర్నెట్ సేవలు విస్తరించుకుని ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో పలు కీలక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. ఐటి ఇంటింటి సౌలభ్యంతో సునాయానాసంగా సుపరిపాలన, పారదర్శకత, దళారీల పాత్రలేని వ్కవస్థకు మార్గం ఏర్పడిందని ప్రధాని తెలిపారు. 
 
ప్రధాని మోదీ నాయకత్వమే బలం 
 
12 ఏండ్ల పాలనలో మోదీ నాయకత్వ పటిమను కొనియాడుతూ ఎన్డీయే నేతలు ఓ తీర్మానం ఆమోదించారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి , టిడిపి నేత ఎన్ చంద్ర బాబు నాయుడు ప్రతిపాదించిన తీర్మానానికి నాగాలాండ్ సిఎం , ఎన్‌పిఎఫ్ నేత నియిఫూ రియో బలపర్చారు. ఇతర నేతల నుంచి ఏకగ్రీవ మద్దతు తెలిపారు.  మోదీ నాయకత్వానికి ఈ తీర్మానంలో ప్రశంసలు వెలువడ్డాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు  మాట్లాడుతూ ప్రధాని మోదీని శక్తిమంతమైన, స్ఫూర్తిదాయకమైన, ప్రపంచ వ్యాప్తంగా గౌరవించబడే వ్యక్తిగా అభివర్ణించారు. దేశానికి పెరుగుతున్న ప్రతిష్ట, ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు పొందుతున్న గౌరవం మోదీ నాయకత్వం వల్లే సాధ్యమయ్యాయని తెలిపారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న తన లక్ష్యాన్ని  భారతదేశం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కాలాన్ని భారతదేశపు కీలక ఘట్టంగా, స్వర్ణయుగానికి నాందిగా ఆయన అభివర్ణించారు.
ఈ సమావేశానికి 75 మంది నేతలు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితీన్ గడ్కరి,  22 ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల నేతలు, బిజెపి సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.
 
వచ్చినవారందరికీ ప్రధాని ఝాల్‌మురీ వంటకం 
 
ఎన్‌డిఎ సదస్సుకు వచ్చిన వారికి ప్రధాని మోమెచ్చిన ప్రత్యేక బెంగాళీ వంటకం ఝాల్‌మురి అందించారు. కోల్‌కతాలో ఈ చిరుతిండి ప్రత్యేకం. మసాలా పల్లీ పేలాల ఈ ప్రత్యేక స్టాల్ వద్ద నిలిచి ఇటీవలి బెంగాల్ ఎన్నికల ప్రచారం దశలో మోదీ కొనుక్కోడం, ఆరగించడం మీడియాలో ప్రచారం పొందింది. బెంగాల్‌లో సామాన్య జనం ఓటుకు దారితీసిందనే ప్రచారం జరిగింది.
 
ఈ క్రమంలో ఇదే స్పెషల్‌ను ఇక్కడ మోదీ ఇష్టపడి అందరికి అందించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ముందుగా దీనిని అక్కడి నుంచి పెద్ద ఎత్తున బెంగాల్ ముఖ్యమంత్రి సువేంధు అధికారి తెప్పించారు. ముందుగా ప్రధానికి అందించారు.