ఆసియాకప్ ఫైనల్‍కు దూసుకెళ్లిన భారత్, శ్రీలంక

ఆసియాకప్ ఫైనల్‍కు దూసుకెళ్లిన భారత్, శ్రీలంక
మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తున్న భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. దంబుల్లా స్టేడియంలో శుక్రవారం జ‌రిగిన‌ సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది.  తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించేసి బంగ్లాదేశ్‍ను చిత్తుచిత్తుగా ఓడించింది భారత్. ముందుగా బౌలింగ్‍లో అదరగొట్టి, ఆ తర్వాత బ్యాటింగ్‍లో రెచ్చిపోయింది హర్మన్‍ప్రీత్ సారథ్యంలోని టీమిండియా.
 
తొలుత పేస‌ర్ రేణుకా సింగ్‌(3/10), రాధా యాద‌వ్‌(3/14)లు ప్ర‌త్య‌ర్థిని స్వ‌ల్ప స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌గా, అనంత‌రం ఓపెన‌ర్లు స్మృతి మంధానా(55 నాటౌట్), ష‌ఫాలీ వ‌ర్మ‌(26 నాటౌట్‌)లు చిత‌క్కొట్టారు. 11వ ఓవ‌ర్లో మంధాన హ్యాట్రిక్ ఫోర్లు బాదింది. దాంతో, హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ బృందం 10 వికెట్ల తేడాతో జ‌య‌భేరి మోగించింది. 
 
త‌ద్వారా ఏడుసార్లు చాంపియ‌న్ అయిన టీమిండియా మరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.  డిఫెండింగ్ చాంపియ‌న్ భార‌త జ‌ట్టు సెమీస్‌లోనూ అద‌ర‌గొట్టింది.  సెమీస్‍లో అద్భుత గెలుపుతో ఆసియాకప్ 2024 ఫైనల్‍లో భారత్ అడుగుపెట్టింది. మరో సెమీస్‍లో శ్రీలంక, పాకిస్థాన్ తలపడగా, సొంత‌గ‌డ్డ‌పై  శ్రీ‌లంక ఫైన‌ల్లో అడుగుపెట్టింది.
 
ఉత్కంఠ మ్యాచ్‌లో పాకిస్థాన్ పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారీ ఛేద‌న‌లో కెప్టెన్ చ‌మ‌రి ఆట‌పట్టు(63) సూప‌ర్ హాఫ్ సెంచ‌రీతో మెర‌సింది. అనుష్కా సంజీవ‌ని(24 నాటౌట్‌), సుగంధిక కుమారిలు(10) అద్భుతంగా ఆడి జ‌ట్టును విజ‌యతీరాల‌కు చేర్చారు. దానితో జూలై 28న టీమిండియా, శ్రీలంక జట్లు తుదిపోరుకు సిద్ధమవుతున్నారు. 
 
మెగా టోర్నీలో హ్యాట్రిక్ విజ‌యాలతో జోరుమీదున్న హ‌ర్మ‌న్‌ప్రీత్ సేన బంగ్లాదేశ్‌పై పంజా విసిరింది. 89 ప‌రుగుల ఛేద‌న‌లో ఓపెన‌ర్లు వీర‌కొట్టుడు కొట్టారు. దాంతో, బంగ్లా బౌల‌ర్లు చేష్ట‌లుడిగిపోగ ఫీల్డ‌ర్లు బిక్క‌మొఖాలు వేశారు. అల‌వోక‌గా బౌండ‌రీలు కొడుతున్న‌ ష‌ఫాలీ, మంధానల‌ను ఎలా క‌ట్ట‌డిచేయాలో తెలియ‌క బంగ్లా సార‌థి సుల్తానా త‌ల ప‌ట్టుకుంది.
 
భార‌త ఓపెన‌ర్ల విధ్వంసంతో 7.1 ఓవ‌ర్ల‌కే స్కోర్ 50కి చేరింది. ఆ త‌ర్వాత కూడా ఈ ఇద్ద‌రూ ఉత‌క‌డం ఆప‌లేదు. న‌హిదా అక్త‌ర్ వేసిన 11వ ఓవ‌ర్లో మంధాన వ‌రుస‌గా మూడు బౌండ‌రీలు కొట్టింది. దాంతో, టీమిండియా 10 వికెట్ల తేడాతో విజ‌య‌ఢంకా మోగించింది. ఆసియా క‌ప్‌లో ఎనిమిదో టైటిల్‌కు మ‌రింత చేరువైంది.
 
సంచ‌ల‌న స్పెల్‌తో ఆక‌ట్టుకున్న రేణుకా సింగ్‌కు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ద‌క్కింది. ఆదివారం జ‌రుగ‌బోయే టైటిల్ పోరులో రెండో సెమీఫైన‌ల్ విజేత‌తో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది.  టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకొని భార‌త్‌కు భారీ లక్ష్యం నిర్ధేశించాల‌నుకుంది. 
 
కానీ, బంగ్లా ఆశ‌ల్ని అడియాశ‌లు చేస్తూ తొలి ఓవ‌ర్లోనే రేణుకాసింగ్(3/10) ఓపెన‌ర్ దిల్హారా అక్త‌ర్‌(4)ను ఔట్ చేసింది. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో ముర్షిదా ఖాటున్(6), ఇష్మ తంజిమ్‌(9)ల‌ను ఔట్ చేసి బంగ్లాను చావు దెబ్బ కొట్టింది. ఒక‌ద‌శ‌లో 21 ప‌రుగుల‌కే మూడు వికెట్లు ప‌డగా కెప్టెన్ నిగ‌ర్ సుల్తానా(32) ప‌ట్టుద‌ల‌గా ఆడింది.
 
టీమిండియా బౌల‌ర్ల‌ను స‌మ‌ర్ధంగా ఎదుర్కొంటూ స్కోర్‌బోర్డును న‌డిపించింది. అయితే.. స్పిన్న‌ర్ రాధా యాద‌వ్(3/14) మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్‌కు పంపింది. దాంతో మ‌రో ఎండ్‌లో సుల్తాన‌కు స‌హ‌క‌రించేవాళ్లే క‌రువ‌య్యారు. అయితే.. ఆఖ‌ర్లో షోమా అక్త‌ర్ బ్యాట్ ఝులిపించ‌డంతో బంగ్లా నిర్ణీత ఓవ‌ర్లో 8 వికెట్ల న‌ష్టానికి 88 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది.