అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలో ఉన్న జో బైడెన్ తప్పుకోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేది ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరిస్ పేరు దాదాపు ఖరారు అవుతుంది. డెమోక్రాట్లు వరుసగా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు కూడా కమలా హరిస్‌కు మద్దతు ప్రకటించారు.
స్వయంగా కమలా హ్యారిస్‌కు ఫోన్ చేసి తమ మద్దతును వెల్లడించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మరికొన్ని రోజుల్లోనే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరో తేలనుంది. మెజార్టీ డెమోక్రాట్లు కమలా హరిస్ వైపే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు తాజాగా జూమ్ కాల్ వేదికగా ఆమె చేపట్టిన ఫండ్ రైజింగ్‌కు రూ.16 కోట్లు సేకరించి సంచలనం సృష్టించారు.
అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేందుకు కమలా హరిస్‌కు మద్దతు ఇచ్చే విషయంలో తామిద్దరం ఎంతో గర్వపడుతున్నామని బరాక్ ఒబామా దంపతులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కమలా హరిస్‌తో బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా ఫోన్‌లో దాదాపు ఒక నిమిషం పాటు మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలా హరిస్‌ను ఓవల్ ఆఫీస్‌కు పంపే విషయంలో తాము ఇద్దరం చేయాల్సిందంతా చేస్తామని హామీ ఇచ్చారు.
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్న కమలా హరిస్ పట్ల గర్వంగా ఉందని మిచెల్ ఒబామా వెల్లడించారు. ఇది చరిత్రాత్మకం కానుందని ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే కమలా హరిస్‌తో మాట్లాడిన దానికి సంబంధించిన వీడియోను ఒబామా దంపతులు ఇద్దరూ తమ ట్విటర్ అకౌంట్లలో షేర్ చేశారు.
ఈ క్రమంలోనే ఒబామా దంపతులు ఇద్దరికి వెంటనే కమలా హరిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా మద్దతు ఇప్పుడు తమకు ఎంతో విలువైందని కమలా హరిస్ వెల్లడించారు. ఇక బైడెన్ రేసు నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి వచ్చిన కమలా హరిస్‌కు డెమోక్రటిక్ పార్టీ సభ్యుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేసిన బరాక్ ఒబామా డెమోక్రటిక్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఈ సమయంలో ఒబామా మద్దతు కమలా హరిస్ ఫండ్‌రైజింగ్ కార్యక్రమాలకు సహాయపడనుంది. డెమోక్రటిక్ పార్టీ అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్‌ను ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా ఒబామా పాల్గొనే అవకాశాలున్నాయి.
మరోవైపు ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లలో హరిస్ రికార్డు సృష్టించారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి కమలా హరిస్ కోసం నిర్వహించిన ఓ జూమ్ కాల్‌లో రికార్డు స్థాయిలో మహిళలు పాల్గొన్నారు. గంటన్నర కంటే తక్కువ సమయం జరిగిన ఈ కాల్‌లోనే ఏకంగా 2 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.16 కోట్లకు పైగా విరాళాలు అందాయి.
కమలాహారిస్‌కు మద్దతుగా “వైట్ వుమెన్ ఆన్సర్ ది కాల్” పేరుతో జూమ్ వేదికగా ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ జూమ్ కాల్‌లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. జూమ్ కాల్ చరిత్రలోనే అతిపెద్ద గ్రూప్ కాల్ ఇదే కావడం గమనార్హం.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
కశ్మీర్‌లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు