వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభం

నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైఎస్సార్సీపీ మోసం చేసిందని మండిపడుతూ ఈ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని ప్రధాన మంత్రి 
నరేంద్ర మోదీ తెలిపారు. పేదల వికాసం కోసం కాకుండా  మాఫియా వికాసం కోసం ఈ ప్రభుత్వం పని చేసిందని దుయ్యబట్టారు. 
 
అన్నమయ్య జిల్లా కలికిరిలో  రాజంపేట బిజెపి ఎంపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ  ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని మాఫియాలకూ పక్కా ట్రీట్‌మెంట్‌ ఇస్తామని హెచ్చరించారు. 
 
రాయలసీమ ప్రాంతం అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఏ రంగంలోనూ పురోగతి సాధించలేని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. సాగు నీటి ప్రాజెక్టులు లేవని చెబుతూ ఏపీలోనూ అభివృద్ధి  జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి రౌడీ రాజ్యం నడిపిస్తున్నారని ఆరోపించారు.
 
రాయలరాయలసీమ సీమ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రధాని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ వికాసమే మోదీ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఏపీలోని మాఫియాలు అన్నిటికి ఎన్డీఏ ప్రభుత్వం సమాధానం ఇస్తుందని ప్రధాని పేర్కొన్నారు.  అనేక ఖనిజాలు, దేవాలయాలు కలిగిన నేల రాయలసీమ అని, చైతన్యవంతులైన యువత ఉన్న ప్రాంతం, రాయలసీమ అని వెల్లడించారు.
అభివృద్ధి కావాలంటే ఎన్డీఏకు ఓటువేయాని పిలుపునిచ్చారు. ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదని, యువతకు ఉద్యోగాలు లేవు, రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఇంటింటికీ పైపులైన్ల ద్వారా నీళ్లు అందించాలనేది మా లక్ష్యమన్న మోదీ, కేంద్ర పథకం జల్‌జీవన్‌ మిషన్‌కు వైసీపీ ప్రభుత్వ సహకారం అందలేదని మోదీ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ వికాసం మోదీ లక్ష్యం అని పేర్కొంటూ  ఏపీలో డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ రావాలని మోదీ తెలుగులో చెప్పారు. నంద్యాల – ఎర్రగుంట్ల రైల్వే లైను పూర్తయిందని, కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.  దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతామని ప్రధాని ప్రకటించారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి అవుతున్న రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
రాయలసీమలో విరివిగా పండే టమాటా, ఇతర కూరగాయల కోసం శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను నెలకొల్పడం ద్వారా రైతులకు అండగా ఉంటామని తెలిపారు. “ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదు. ఐదేళ్లుగా యువతకు ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు. ఐదేళ్లుగా రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైసీపీ మోసం చేసింది. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, ప్రజల కష్టాలు తీరాలి” అని ప్రధాని చెప్పారు.