పిట్రోడా `జాత్యహంకార’ వ్యాఖ్యలపై దుమారం .. కాంగ్రెస్ పదవికి రాజీనామా

* శరీర రంగును చూసి ప్రజలను అవమానిస్తారా?.. ప్రధాని ఆగ్రహం

ఇటీవలే వారసత్వ పన్ను గురించి కామెంట్‌ చేసి వివాదంలో ఇరుక్కున్న సామ్ పిట్రోడా  తాజాగా భారత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసి మ‌రో వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. ద‌క్షిణ భార‌తంలో ఉన్న వాళ్లు ఆఫ్రిక‌న్లుగా, తూర్పున ఉన్నవాళ్లు చైనీయులుగా, ప‌శ్చిమంలో ఉన్నవాళ్లు ఆర‌బ్బులుగా క‌నిపిస్తున్నార‌ని పిట్రోడా వ్యాఖ్యానించారు.

ఈ వాఖ్యలతో మరోసారి దుమారం చెలరేగడంతో ఆ వాఖ్యలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఆ తర్వాత కొద్దీ సేపటికే ఆయన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రకటించారు.

 భార‌త్‌లో ఉన్న ప్రజాస్వామ్యం గురించి ఆయ‌న వ్యాఖ్యానిస్తూ భార‌త్ భిన్నత్వ దేశ‌మ‌ని, కానీ అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ఉంటార‌ని, తూర్పున ఉన్నవాళ్లు చైనీయులుగా, ప‌శ్చిమంలో ఉన్నవాళ్లు అర‌బ్బులుగా, ఉత్తరంలో ఉన్నవాళ్లు శ్వేత‌జాతీయులుగా, ద‌క్షిణంలో ఉన్న వాళ్లు బ‌హుశా ఆఫ్రిక‌న్లుగా క‌నిపిస్తార‌ని పిట్రోడా పేర్కొన్నారు. 

భార‌త దేశ ప్రజ‌లు భిన్న భాష‌ల‌ను, మ‌తాల‌ను, ఆహారాన్ని, ఆచారాల‌ను గౌర‌విస్తార‌ని చెబుతూ భార‌త్‌లో ప్రతి ఒక్కరికీ స్థానం ఉంద‌ని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో కాంప్రమైజ్ అవుతుంటార‌ని ఆయ‌న తెలిపారు. ఆయన వ్యాఖ్యలు  తీవ్ర దుమారం రేపాయి. దీనిపై బీజేపీ సహా కాంగ్రెస్‌లోని పలువురు నేతలు కూడా మండిపడుతున్నారు.

ఈ వాఖ్యాలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండిస్తూ శరీర రంగును చూసి ప్రజలను అవమానిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. నల్లటి చర్మం కలిగిన శ్రీకృష్ణుడి భూమి ఇది అని, ఆయన్ను ఇక్కడ పూజిస్తున్నామని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ యువరాజు (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చర్మం రంగు ఆధారంగా మన దేశ ప్రజలను అగౌరవపరచడాన్ని ఎన్నటికీ సహించేది లేదని ప్రధాని తేల్చి చెప్పారు.

 రాష్ట్రపతి  ఎన్నికల్లో ద్రౌపది ముర్ముని కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకించిందో తనకు ఇప్పుడు అర్థమైందని ప్రధాని తెలిపారు. ‘రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముని కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకించిందని నేను అప్పుడు ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఆదివాసి అయిన ముర్మును కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు ఓడించాలని ప్రయత్నించిందో ఇప్పుడు అర్థమైంది. ద్రౌపది ముర్ము గారి చర్మం రంగు నలుపు’ అంటూ ప్రధాని ధ్వజమెత్తారు. 

`ఇక్కడ ఉన్న రాజకుమారిడికి (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) అమెరికాలో ఓ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ ఉన్నారు (పిట్రోడాను ఉద్దేశిస్తూ). ఆయన ఇటీవలే ఓ మాట చెప్పారు. చర్మం నల్లగా ఉన్నవారంతా ఆఫ్రికన్లు అని. అంటే చర్మం రంగును బట్టి ద్రౌపది ముర్ముగారిని ఆఫ్రికన్ అని కాంగ్రెస్ వాళ్లు భావించి ఉంటారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెను ఓడించాలని కాంగ్రెస్ పార్టీ భావించి ఉంటుంది. దేశంలో చాలా మందికి నలుపు చర్మం ఉంటుంది. ఈ నలుపు ఎక్కడి నుంచి వచ్చిందనేది అర్థం చేసుకోవాలి. భగవాన్ శ్రీకృష్ణుడు రంగు నీలం, నలుపు’ అని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవంక, పిట్రోడా వ్యాఖ్య‌ల‌పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఓవైపు మీరు భార‌త్ జోడో యాత్ర చేసి ప్రేమ దుకాణం గురించి మాట్లాడుతూనే మ‌రోవైపు అరబ్బులు, చైనీయులు, ఆఫ్రిక‌న్లు అంటూ జాతి వివ‌క్ష‌, విభ‌జిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆక్షేపించారు.

కర్నాట‌క ఉప ముఖ్యమంత్రి డీకే శివ‌కుమార్ సోద‌రుడు డీకే సురేష్ దక్షిణాది, ఉత్త‌రాది వాద‌న‌ల‌ను తెర‌పైకి తెస్తుండ‌గా, విప‌క్ష ఇండియా కూట‌మి భాగ‌స్వామ్య పార్టీలు ఉత్త‌రాదిని, స‌నాత‌న ధ‌ర్మాన్ని అవ‌మానించేలా మాట్లాడుతున్నార‌ని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ సిద్ధాంతం అంతా అస‌త్యాలు, విభ‌జ‌న వాదం, భార‌తీయుల‌ను విభ‌జించి దేశాన్ని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డ‌మేన‌ని, ఈ విష‌యం వారి వ్యాఖ్య‌ల ద్వారా బ‌హిర్గ‌త‌మ‌వుతోంద‌ని కేంద్ర మంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.