100కు పైగా ఎయిరిండియా విమానాల రద్దు

* క్యాబిన్‌ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు
 
టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయాన సంస్థకు ఉద్యోగులు షాకిచ్చారు. ఆ సంస్థ యాజమాన్య విధానాలను నిరసిస్తూ అనారోగ్య కారణాలతో 200 మందికిపైగా క్యాబిన్‌ సిబ్బంది ఒకేసారి మూకుమ్మడిగా సెలవు పెట్టారు. ఫలితంగా మంగళవారం రాత్రి నుంచి 100కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అనేక విమానాలు ఆలస్యమయ్యాయి. దీని వలన దాదాపు 15 వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడినట్టు సమాచారం.

ఢిల్లీ, కొచ్చి, కాలికట్‌, బెంగళూరు సహా పలు ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే బుధవారం ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 14 విమానాలు రద్దయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా గల్ఫ్‌కు గణనీయ సంఖ్యలో విమాన సర్వీసులు నడిపే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 13 వరకు విమాన సర్వీసులను తగ్గించుకోవాలని నిర్ణయించింది.

కేరళలోని విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానాల రద్దుపై నివేదిక సమర్పించాలని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ యాజమాన్యాన్ని పౌరవిమానయాన శాఖ కోరింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, డబ్బులు తిరిగి చెల్లిస్తున్నామని, ప్రయాణాన్ని రద్దు చేసుకునేందుకు అంగీకరించినవారికి మరో తేదీకి టికెట్‌ ఇస్తున్నామని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ వివరించింది.

వీటిలో అంతర్జాతీయ విమానాలూ ఉన్నాయి. కేరళ నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలన్నీ రద్దవడంతో మళయాలీలు ఆయా విమానాశ్రయాల్లో ఆందోళన చేశారు. అక్కడి ప్రయాణికులతో తమ సిబ్బంది సమ్మెలో ఉండడంవల్ల ఈ పరిస్థితి నెలకొందని అధికారికంగా చెప్పిన ఎయిరిండియా ఆ తర్వాత ఓ పత్రికా ప్రకటనలో సిబ్బంది మూకుమ్మడి సెలవులే కారణమని పేర్కొంది. 

‘‘విమానాల్లో ప్రయాణికులకు సేవలందించే 300మంది వరకు సిబ్బంది మూకుమ్మడిగా సిక్‌లీవ్‌లు పెట్టారు. దీంతో పలు సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రయాణికుల టికెట్‌ ధరను పూర్తిగా రిఫండ్‌ చేస్తాం. లేదా వారు కోరుకున్న తేదీకి ప్రయాణాన్ని రీషెడ్యూల్‌ చేస్తాం’’ అని ఎయిరిండియా అధికార ప్రతినిధి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కేరళీయులపై ఎక్కువ ప్రభావం

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాల రద్దు ప్రభావం కేరళీయులపై ఎక్కువగా పడింది. కేరళ నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లే విమానాలన్నీ రద్దవడంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టా రు. ‘‘సెక్యూరిటీ, బ్యాగేజ్‌ చెక్‌ఇన్‌, ఇమిగ్రేషన్‌ పూర్తయ్యాక.. విమానం రద్దు సందేశం వచ్చింది. నేను గురువారమే నా ఉద్యోగంలో చేరాలి. లేకుంటే నా కొలువు ఊడిపోతుంది’’ అని కన్నూరుకు చెందిన ఓ మహిళ వాపోయారు. కొందరు ప్రయాణికులకు ఈ నెల 14 నుంచి 17 తేదీల్లో విమాన ప్రయాణాన్ని రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, విస్తారాలను నిర్వహిస్తున్న టాటా గ్రూపులో సంస్థాగతంగా నిర్వహణా లోపాలు, ఉద్యోగులపై అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ‘మూకుమ్మడి సెలవుల’పై వెళ్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విస్తారాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఓవైపు కంపెనీ లాభాల్లో ఉన్నా, తమకు హెచ్‌ఆర్‌ఏ వంటి అలవెన్స్‌లు తొలగించడంపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగుల సంఘం ఏప్రిల్‌లో టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది.

పైలట్లకు కొత్త వేతన విధానాన్ని అన్ని టాటా గ్రూపు విమానయాన సంస్థల్లో అమలు చేయాలని తీసుకొన్న నిర్ణయాన్ని విస్తారాలో పైలట్లు, ఫస్ట్‌ ఆఫీసర్లు వ్యతిరేకించారు. సంబంధిత కాంట్రాక్ట్‌పై సంతకం చేయాలని యాజమాన్యం ఉద్యోగులకు అల్టిమేటం ఇవ్వడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైంది. రోస్టర్‌ విధానంపై అసంతృప్తి, వీక్లీ ఆఫ్‌లు కూడా ఉండటం లేదని విస్తారాలో ఉద్యోగులు గత నెల మూకుమ్మడి సెలవులకు వెళ్లారు.