సీనియర్ ఐపీఎస్ ఎబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి తనను సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేయడంతో క్యాట్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనే వాదనలు పూర్తవ్వగా తీర్పును రిజర్వ్ చేసిన క్యాట్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 
 
ఏబీ వెంకటేశ్వరారవును రెండోసారి అవే ఆరోపణలపై  సస్పెండ్ చేయడం న్యాయ విరుద్దమని క్యాట్ వ్యాఖ్యానించింది.తక్షణమే ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్‌లోకి తీసుకుని ఆయనకు రావాల్సిన బకాయిల మొత్తం ఇవ్వాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశాల్లో స్పష్టం చేసింది. సస్పెన్షన్ చట్ట విరుద్దమని, ఒకసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.
 
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్న సమయంలో విపక్ష నేతలపై ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు తెప్పించినట్లు వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై అభియోగాలు మోపింది. ఇదే అభియోగంపై ఆయనపై తొలిసారి సస్పెన్షన్ విధించిన ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగిలింది. 
 
తాను నిఘా పరికరాలకు ఆర్డర్ మాత్రమే చేశానని, పరికరాల కొనుగోలు కూడా జరగలేదని ఏబీ వెంకటేశ్వరరావు వాదించారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ తొలగించారు. అయితే ఆ తర్వాత కూడా ఏబీ వెంకటేశ్వరరావుకు సస్పెన్షన్ కాలంలో జీతభత్యాల బకాయిలు చెల్లించలేదు. దీంతో అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. 
 
అదే సమయంలో మరోసారి ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై తిరిగి ఆయన కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ అభియోగాలు, సస్పెన్షన్ పై విచారణ జరిపిన క్యాట్ ఏబీ వెంకటేశ్వరరావును నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు ఇవాళ ఆయనపై విధించిన సస్పెన్షన్ కొట్టేస్తూ తీర్పు ప్రకటించింది.

తనపై ఒకే అభియోగంపై రెండుసార్లు సస్పెన్షన్ విధించడం చెల్లదని ఏబీ వెంకటేశ్వరరావు వాదించారు. దీంతో క్యాట్ ఏకీభవించింది. గతంలో ఓసారి ఇదే అభియోగంతో సస్పెన్షన్ విధించడం, దాన్ని కోర్టు కొట్టేయడం జరిగిపోయాక మరోసారి అదే అభియోగంతో రెండోసారి సస్పెన్షన్ చెల్లదని క్యాట్ తేల్చేసింది.