ప్రభుత్వ పథకాలు ఆపాలని ఈసీ ఆదేశాలు ఇవ్వలేదు

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా  వెల్లడించారు. కొంతకాలం తరువాత ఇవ్వాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
 
ఏపీలో పోస్టల్‌ బ్యాట్ కోసం 4.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.30 లక్షల మంది ఓటు హక్కును సద్వినియోగ పరుచుకున్నారని ఆయన వివరించారు.పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ను దాదాపు 70 శాతం పూర్తికాగా అవసరమైతే 9వ తేదీ వరకు పొడిగిస్తామని తెలిపారు. 
 
ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్‌ కోసం20 రోజుల సమయాన్ని ఇచ్చామని, గడువు పెంపు సాధ్యం కాదని పేర్కొన్నారు. కొన్ని పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు మాత్రమే కోరిందని పేర్కొన్నారు. నాయకులకు సెక్యూరిటీ ఉన్న సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తామని ఆయన తెలిపారు.
 
సెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల తొమ్మిదో తేదీన కూడా అవకాశం ఉన్నట్లు మీనా స్పష్టంచేశారు. సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చునని సూచించారు. వచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టమని తెలిపారు. ఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చామని పేర్కొన్నారు.
 
 కొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్న ఎన్నికల ప్రధానాధికారి, కొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చామని, కొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారని దీనిపై విచారణ చేపడుతున్నామని వివరించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
కాగా, ఏపీలో మరో ఇద్దరు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, సదుం ఎస్సై మారుతిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారి బాధ్యతలను కిందిస్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికార పార్టీకి అంటకాగుతూ, ఎన్నికల వేళ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో ఈ అధికారులపై ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.