భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (బ్లాక్‌హోల్) అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ను ప్రయోగించింది. ఇస్రో విజయాశ్వంగా పిలుబడే పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోని 60 రాకెట్ పీఎస్‌ఎల్‌వీ -సీ58 ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి విజయవంతంగా వెళ్లింది. దీంతో ఈ ఏడాది ఇస్రోకు శుభారంభం లభించింది. కొత్త సంవత్సరం మొదటి రోజున చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడం శుభపరిణామం. ఎక్స్‌రే మూలాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం 9:10 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ నింగిలోకి ప్రవేశించింది. ఈ పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ద్వారా 480 కిలోల ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని (ఎక్స్‌పోశాట్) నింగిలోకి పంపించారు. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ రోదసీలోకి దూసుకెళ్ళిన వాహకనౌక 21.5 నిమిషాల్లో నిర్ధేశిత కక్ష్యలోకి అత్యాధునిక ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు మరో పది ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్తున్నది.
ఖగోళ శాస్త్రంలో సరికొత్త చరిత్రకు ఇస్రో నాంది పలుకబోతున్నది. ఇది భారత్ తొలి పొలారిమెట్రీ మిషన్ కాగా ప్రపంచంలో రెండోది. ఇంతకు ముందు ఈ తరహా మిషన్ అమెరికా చేపట్టింది. సవాళ్లతో కూడుకున్న పల్సర్‌లు, బ్లాక్‌హోల్ ఎక్స్ రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్ స్టార్స్, నాన్ థర్మల్ సూపర్ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్‌పోశాట్ అధ్యయనం చేయనున్నది.
ఈ ఉపగ్రహాన్ని 500-700 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెడతారు. ఐదేండ్లపాటు సేవలందించనున్న ఎక్స్‌పోశాట్‌లో రెండు పేలోడ్స్ ఉన్నాయి. పాలీఎక్స్ (ఎక్స్-కిరణాలలో పొలారిమీటర్ పరికరం), ఎక్స్-రే స్పెక్ట్రోసోపీ, టైమింగ్ (ఎక్స్‌పెక్ట్-ఎక్స్‌స్‌పీఈసీటీ)ను అమర్చారు.
శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ -సీ 58 రాకెట్ ప్రయోగాన్ని పురష్కరించుకుని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాధ్ షార్‌కు చేరుకొనిశాస్త్రవేత్తలతో కలిసి కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించి ప్రయోగ సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.
విశ్వంలో ఇంతవరకు తెలిసిన అత్యంత దేదీప్యమానమైన ప్రకాశంతో కూడిన 50 కాంతి పుంజాల మూలాలను పరిశోధించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యమని ఇస్రో వెల్లడించింది. ఈ 50 కాంతి పుంజాల్లో కృష్ణబిలం, ఎక్స్‌రే జంట నక్షత్రాలు, క్రియాశీలకమైన పాలపుంత కేంద్రకాలు, న్యూట్రాన్ నక్షత్రాలు, నాన్‌థర్మల్ సూపర్‌నోవాల అవశేషాలు ఉన్నాయి.
ఈ ఎక్స్‌పోశాట్ శాటిలైట్ కనీసం ఐదేళ్ల పాటు తన పరిశోధనను నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. అలాగే కేరళ యూనివర్శిటీ విద్యార్థులు రూపొందించిన వీఐవై నానాశాట్‌లను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. పాలీఎక్స్‌ను రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేయగా, ఎక్స్‌పెక్ట్‌ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌కు చెందిన స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ రూపొందించింది. ఖగోళ వస్తువులు, తోకచుకుల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని ఎక్స్‌పోశాట్ సేకరించనున్నది.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష