మాదిగలు, బిసిలు కాంగ్రెస్‌కు ఓటేయ‌వ‌ద్దు

మాదిగలు, బీసీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఏనాడు లేని విధంగా కాంగ్రెస్ మాదిగలను అవమానించిందని ధ్వజమెత్తారు.  లోక్ సభ ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి ఒక్క సీటు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ చలో హైదరాబాద్ పేరుతో ఎంఆర్పీఎస్ పిలుపు మేరకు మహాధర్నా చేపట్టారు.

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. తమ సామాజికవర్గానికి ఒక్క ఎంపీ టికెట్‌ కూడా ఇవ్వకపోవడంపై మాదిగలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు.. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ సంఘీభావం తెలిపారు. రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ నాయకులు, శ్రేణులు మహాధర్నాకు తరలివచ్చారు.

ఈ సంద‌ర్భంగా మందా మాట్లాడుతూ తమ ఇందిరా పార్క్ దీక్షను పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌లో దళితుల ఆధ్వర్యంలో ధర్నా ఏర్పాటు చేశారని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.  మాదిగల ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

మోదీతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం లేదని, కాంగ్రెస్‌కు మాత్రం ప్రమాదం ఉందని ఎద్దేవా చేశారు. లోక్‌సభలో ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకుండా రేవంత్ కుట్రపన్నారంటూ మోత్కుపల్లి ఒక దశలో కంటితడి పెట్టారు. 

80 లక్షల మంది మాదిగలు ఉంటే 1 పార్లమెంట్ సీటు, కనీసం కంటోన్మెంట్ అసెంబ్లీ సీటైనా ఇవ్వడానికి మనసు రాలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పెద్దలు ఎందుకు పెదవి విప్పలేదని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తనను చంపినట్లేనని ముఖ్యమంత్రికి మన బలమేంటో చూపిద్దామని కాంగ్రెస్ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు పిలుపిచ్చారు.

 ‘నా అక్కాచెల్లెల్లందరికీ చెబుతున్నా… రేవంత్ రెడ్డికి ఓటేస్తే నన్ను మీరు చంపినట్లే. రేవంత్ రెడ్డికి ఓటేస్తే మీరు మోత్కుపల్లి నర్సింహులును చంపినట్లే. మీ కోసం నా జీవితం ఇస్తా. మీ కోసం నా ప్రాణం ఇస్తా. ఈ జాతి గౌరవం నిలబడాలి. మన బలమేంటో తెలియాలి. మాదిగ బలమేంటో మీకు చూపిస్తాం రేవంత్ రెడ్డీ’ అంటూ భావోద్వేగంతో చెప్పారు.

తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి మాదిగల బలాన్ని చూపించాలని కోరారు. మాదిగల బలం కాంగ్రెస్ పార్టీకి తెలిసేలా చేస్తామని చెబుతూ తమకు గౌరవం ఇవ్వకపోతే కాంగ్రెస్‌ను పాతిపెడతామని హెచ్చరించారు.  పుట్నాలు పంచితే ప్రజలు ఓటేశారనుకున్నావా? పుట్నాలకు ఆశపడే వాళ్లం కాదు. ఆత్మగౌరవం.. మా జాతి గౌరవం మాకు ముఖ్యమని తెలిపారు. మాకు గౌరవం ఇస్తే సహకరిస్తామని… గౌరవించకుంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.