జీఎస్టీ రిఫండ్ పేరుతో రూ.100 కోట్ల కుంభకోణం

తెలంగాణాలో ఈ-బైక్స్ తయారు చేస్తున్న కంపెనీలు జీఎస్టీ రిఫండ్ పేరుతో రూ. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు బయటపడింది. ఈ కుంభకోణాన్ని మొత్తం ఏడు గ్రూపులు కలిసే చేసినట్లు పోలీసులు తేల్చారు. నకిలీ పత్రాలు సృష్టించి ఈ బైక్ కంపెనీలు ప్రభుత్వం నుంచి అక్రమంగా దాదాపు రూ. 100 కోట్ల జీఎస్టీ రీఫండ్‌కు పాల్పడినట్టు తేలింది. అయితే ఈ జీఎస్టీ రీఫండ్‌ ముఠాకు కమర్షియల్ టాక్స్ అధికారులు సహకరించినట్టు తేలటంతో ఏడుగురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీకి చెందిన చిరాగ్ శర్మ, కడపకు చెందిన వామిరెడ్డి రాజా, ముమ్మగారి గిరిధర్ రెడ్డి, కొండ్రగుంట వినీల్ చౌదరి, నల్గొండ కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ పీటల స్వర్ణ కుమార్, అబిడ్స్ కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వేణు గోపాల్, మాదాపూర్ కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ విశ్వ కిరణ్, మాదాపూర్ కమర్షియల్ స్టేట్ టాక్స్ ఆఫీసర్ వెంకట రమణ, మాదాపూర్ సర్కిల్ సీనియర్ టాక్స్ అధికారి మర్రి మహితతో కలిపి మొత్తం ఐడుగురిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2022 జూలై నుంచి 2023 నవంబర్ సమయంలో ఈ-బైక్‌ల తయారీ, టాల్కమ్‌ పౌడర్‌ ఉత్పత్తి సంస్థల పేరుతో డీలర్ల అవతారమెత్తిన కొందరు అక్రమార్కులు ప్రభుత్వ సొమ్మును దోచేశారు. వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులు కూడా ఇందులో కుమ్మక్కై ఇష్టానుసారంగా రీఫండ్‌లు ఇచ్చేశారు. హైదరాబాద్‌ రూరల్‌ డివిజన్‌, ప్రస్తుత మాదాపూర్‌ డివిజన్‌ పరిధిలో ఈ బాగోతం నడిచినట్టు తేలింది.

ఈ-బైక్‌ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్రం 5 శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు మాదాపూర్‌ కేంద్రంగా బోగస్‌ సంస్థలకు తెరలేపారు. ఈ-బైక్‌ల తయారీ నిమిత్తం జీఎస్టీ లైసెన్స్‌లు కూడా తీసుకున్నారు. 

 
వీటికి లైసెన్స్‌లు ఇచ్చే ముందు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే లైసెన్స్‌లు ఇచ్చేశారు. ఆ సంస్థ వ్యాపార కార్యకలాపాలు చేస్తుందో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు.  బయట నుంచి ఈ-బైక్‌ విడిభాగాలు తీసుకొచ్చినట్లు వాటిపై 18 శాతం జీఎస్టీ చెల్లించినట్లు ఇన్‌వాయిస్‌లు సృష్టించారు. 
 
ఆ విడిభాగాలను అసెంబుల్‌ చేసి 5 శాతం జీఎస్టీతో ఈబైక్‌లు అమ్మినట్లు బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. విడిభాగాల విలువపై చెల్లించిన 18 శాతం జీఎస్టీలో కేంద్ర నిబంధన ప్రకారం 13 శాతం రాయితీ పొందారు. రూపాయి పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వ సొమ్మును దోచేసిన అక్రమార్కులు అధికారులకు అడిగినంత కమిషన్‌ ఇచ్చారు. కోటి రూపాయిలు రీఫండ్‌ ఇస్తే రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు అధికారులు కమిషన్లు తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి.