సీఎం రమేష్ అరెస్ట్.. కాన్వాయ్ పై వైసీపీ నేతల దాడి

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తాడువలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అనకాపల్లి కూటమి అభ్యర్థి, బీజేపీ నేత సీఎం రమేశ్‌పై ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి పార్లమెంటు వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు అనుచరులు దాడికి తెగబడ్డారు.  గాయపడిన బీజేపీ నేతను పరామర్శించేందుకు వెళ్తున్నక్రమంలో సీఎం రమేశ్‌ను అడ్డగించడంతోపాటు ఆయనపై దాడి చేసి చొక్కా చింపేశారు.

బూడి స్వగ్రామమైన దేవరాపల్లి మండలం తారువలో శనివారం ఈ ఘటన జరిగింది. గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేశారనే కారణంతో ఆ పార్టీ నాయకులపై ముత్యాలనాయుడు అనుచరులు దాడి చేశారు. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు.  ఈ విషయం తెలుసుకున్న రమేశ్‌ హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లారు. అయితే పోలీసులు ఆయనను అరెస్టు చేసి తరువాత విడుదల చేశారు.

తమ పార్టీ వారిని ఇంట్లోకి దూరి కొట్టారని రమేశ్‌ బృందం ఆరోపిస్తూ బూడి, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేసింది. హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది.  అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తాడువలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తారువలో బూడి బావమరిది(మొదటి భార్య సోదరుడు) గంగాధర్‌ బీజేపీ నాయకుడుగా ఉన్నారు. ఎన్నికల అధికారుల అనుమతితో శనివారం మధ్యాహ్నం డ్రోన్‌తో బీజేపీ జెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారు. 

ఆ సమయానికి గ్రామంలోనే ఉన్న బూడి, ఆయన అనుచరులు తమను చంపడానికి డ్రోన్‌తో రెక్కీ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ గంగాధర్‌, డ్రోన్‌ను ఆపరేట్‌ చేస్తున్న కె. అప్పారావు, పాండురంగారావు, సాయికృష్ణలపై దాడి చేసి గాయపరిచారు. బాధితులు దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, కొందరు కార్యకర్తలను వెంటబట్టుకుని కూటమి నేతలపై దాడులకు దిగాడు. బీజేపీ నాయకుడు గంగాధర్‌ని చెప్పుతో కొట్టారు. రెండు ద్విచక్రవాహనాలు ధ్వసం చేశారు. ఈ దాడిలో నలుగురు తీవ్రగాయాలయ్యాయి.

తన మనిషిని ఎందుకు కొట్టారు..? ఆయన చేసిన తప్పేంటి? అని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్  ప్రశ్నిస్తూ పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు సైతం విర్రవీగి ప్రవర్తించి సీఎం రమేషన్‌ను అరెస్ట్ చేశారు. మాడుగుల నియోజకవర్గంలోని తారువ గ్రామంలో రమేష్‌ను అరెస్ట్ చేసి పోలీసు జీపులో తరలించారు. 

 ఓవైపు పోలీసులు సిఎం రమేశ్‌ను తరలిస్తుండగా, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయన కాన్వాయ్ పై దాడికి దిగారు. కర్రలతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు సిఎం రమేశ్‌కు చెందిన మూడు కార్లు ధ్వంసం చేశారు. ఆయనను తరలిస్తున్న పోలీసు వాహనాలపై సైతం వైసీపీ నేతలు దాడికి యత్నించారు.

కార్యకర్తకు న్యాయం చేయాలని వస్తే తనపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని సీఎం రమేశ్‌ ప్రశ్నించారు. డీఎస్పీ సాక్షిగా తన వాహనానికి అడ్డంగా బెంచీ వేసుకొని కూర్చుని బూడి ముత్యాలనాయుడు అడ్డుకున్నారని తెలిపారు. బూడి రెచ్చిపోయినా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మంత్రి బూడి ముత్యాలనాయుడు దౌర్జన్యాలు, ఆగడాలను సాగనివ్వబోనని హెచ్చరించారు. 

సీఎం రమేష్ అరెస్టుతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె కన్నెర్రజేశారు.  ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని, ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను కుట్రపూరితంగా అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులతో ఈ పనులు చేయిస్తోందని పురంధేశ్వరి ఆరోపించారు. మరోవైపు రమేష్ అరెస్ట్ కూటమిలోని కీలక నేతలు తీవ్రంగా స్పందించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.