రాజమండ్రి జైలులో ఖైదీకి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కరోనా కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలె కరోనా బారిన పడి ఓ వృద్ధుడు చనిపోవడం కలకలం రేపింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఓ కరోనా కేసు నమోదు కావడం తీవ్ర సంచలనంగా మారింది.  జైలులోని ఓ ఖైదీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జైలులో ఉన్న మిగితా నిందితులు, ఖైదీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అయితే అతడిని ఆస్పత్రికి తరలించి జైలు అధికారులు చికిత్స అందిస్తున్నారు. కాకినాడకు చెందిన 67 ఓ వృద్ధుడికి తాజాగా జైలులో కరోనా సోకింది. ఈ ఏడాది మే నెలలో ఓ కేసులో దోషిగా తేలడంతో ఆ వృద్ధుడికి శిక్ష పడడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నెల 17 నుంచి దగ్గు, జలుబు, జ్వరం ఉండడంతో జైలు ఆస్పత్రికి తరలించి జైలు అధికారులు చికిత్స అందించారు. అయితే ఈనెల 19 వ తేదీన జ్వరం ఎక్కువ కావడంతో జీజీహెచ్‌కు తరలించారు. 

కరోనా లక్షణాలు ఉండటంతో కరోనా టెస్టులు చేయగా శనివారం టెస్ట్ ఫలితం రావడంతో కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ వృద్ధుడికి ఆర్టీపీసీఆర్‌ టెస్ట్ చేసిన డాక్టర్లు వాటి ఫలితాలను ల్యాబ్‌కు పంపించారు. దీంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది ఆ వృద్ధుడు ఉన్న బ్యారక్‌ పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయించారు. 

ఇతర ఖైదీలకు కరోనా సోకకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఇతర ఖైదీలు, జైలు సిబ్బందికి కూడా కరోనా టెస్టులు చేయిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం ఆ వృద్ధుడిని ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ వృద్ధుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని డాక్టర్లు తెలిపారు.

రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లాలో 87 సంవత్సరాల వృద్ధుడికి ఓపెన్‌ హార్ట్‌ సర్జరి జరిగింది. అయితే అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే కొవిడ్‌ బారిన పడ్డాడు. అనంతరం చనిపోవడంతో కరోనాతో మరణించిన మొదటి కేసుగా అధికారులు గుర్తించారు.