ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 23 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 23 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
 
* అభ్యర్థులు అందరిలో సంపన్నులు చంద్రబాబు, నారాయణ, జగన్
 
ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థులలో 23 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, వారిలో 16 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.
 
ప్రధాన పార్టీలలో, వైసిపి నుండి 175 మంది అభ్యర్థులలో 87 మంది (50%), టిడిపి నుండి 143 మంది అభ్యర్థులలో 119 మంది (83%), కాంగ్రెస్ నుండి 158 మంది అభ్యర్థులలో 42 (27%) మంది, బిజెపి నుండి 10 మంది అభ్యర్థులలో 8  (80%) మంది, సీపీఐ(ఎం) నుంచి 8 మంది అభ్యర్థుల్లో 5 మంది (63%), సీపీఐ నుంచి 8 మంది అభ్యర్థుల్లో 5 మంది (63%), జనసేన పార్టీ నుంచి 21 మంది అభ్యర్థుల్లో 10 మంది (48%) అఫిడవిట్ లలో వారు పేర్కొన్న వివరాల ఆధారంగా అసోషియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌), ఏపీ ఎలక్షన్‌ వాచ్‌ విశ్లేషణ జరిపారు.

పీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 175 మంది వైసీపీ అభ్యర్థుల్లో 87 మంది క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో టీడీపీ అభ్యర్థులు 42 మంది ఉండగా, బీజేపీ నుంచి 8 మంది, జనసేన పార్టీ అభ్యర్థులు 10 మంది ఉన్నారు. ఇక, 604 మంది కోటీశ్వరులు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. వీరిలో వైసీపీ, టీడీపీ, జనసేన తదితర ప్రాంతీయ పార్టీల తరఫున 307 మంది కోటీశ్వరులు ఎన్నికల బరిలో నిలిచారు.

వైసీపీ తరఫున 165, టీడీపీ నుంచి 134, జనసేన తరఫున 18, బీజేపీ నుంచి 8, కాంగ్రెస్‌ నుంచి 79, సీపీఎం, సీపీఐ నుంచి ఒక్కొక్కరు చొప్పున కోటీశ్వరులు పోటీ చేస్తుండడం గమనార్హం. వీరిలో 323 మంది రూ.5 కోట్ల కంటే ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి. పోటీలో ఉన్న మొత్తం అన్ని పార్టీల అభ్యర్థుల సగటు ఆస్తి రూ.8.02 కోట్లుగా ఉంది. ఇక, తాజా ఎన్నికల్లో 229 (10 శాతం) మంది మహిళలు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 193 మంది పోటీ చేయగా ఈసారి ఆ సంఖ్య పెరిగింది.

మొత్తం అభ్యర్థుల్లో 543 మందిపై క్రిమినల్‌ కేసులు, 374 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. గత 2019 ఎన్నికల్లో క్రిమినల్‌ కేసులు ఉన్నవారి సంఖ్య 331 కాగా ఇప్పుడు వీరిసంఖ్య పెరిగింది. తీవ్రమైన క్రిమినల్‌ కేసులకు సంబంధించి గత ఎన్నికల్లో 220 మందిపై కేసులుండగా, ఇప్పుడు 374మందిపై ఉన్నాయి.

వైసీపీ 87, టీడీపీ 42, కాంగ్రెస్‌ 42, జనసేన 10, బీజేపీ 8, సీపీఎం, సీపీఐలో ఐదుగురి చొప్పున అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులన్నాయి. మొత్తం అభ్యర్థుల్లో వీరు 23 శాతం మంది ఉన్నారు. తీవ్రమైన నేరాలకు సంబంధించి వైసీ పీ 49, టీడీపీ 85, కాంగ్రెస్‌ 20, జనసేన 7, బీజేపీ 5, సీపీఎం 3, సీపీఐ ఇద్దరు అభ్యర్థులపై కేసులున్నాయి.

మొత్తం 89 మంది అభ్యర్థులపై మహిళలపై దాడులకు సంబంధించిన కేసులుండగా వీరిలో నలుగురిపై అత్యాచార కేసులు నమోదయ్యాయి. 16 మందిపై హత్య (సెక్షన్‌ 302), 70 మందిపై హత్యాయత్నానికి (సెక్షన్‌ 307) సంబంధించిన కేసులున్నాయి.

అత్యధికంగా ఆస్తులున్న అభ్యర్థులలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు రూ.931 కోట్ల ఆస్తులున్నాయి. రూ.824 కోట్లతో నెల్లూరు నగరంలో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ రెండో స్థానంలో ఉన్నారు. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ మోహన్ రెడ్డి రూ.757 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో ఉన్నారు.

అత్యధికంగా సీఎం జగన్‌ కుటుంబానికి ఏడాదికి రూ.73 కోట్లు ఆదాయం ఉంది. జగన్‌ ఒక్కరికే ఏడాదికి రూ.57 కోట్ల ఆదాయం ఉంది. రెండో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి జనార్థన్‌రెడ్డి కుటుంబానికి రూ.37 కోట్లు, వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కుటుంబానికి రూ.34 కోట్ల ఆదాయం ఉంది.