జిల్లా జీడీపీ అంచనాలను రూపొందించాలని ప్రధాని మోదీ పిలుపు

జిల్లా జీడీపీ అంచనాలను రూపొందించాలని ప్రధాని మోదీ పిలుపు
* మొదటిసారి ముఖ్యమంత్రులు అందరూ హాజరైన నీతి ఆయోగ్ సమావేశం 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల సమస్యలను వేగంగా పరిష్కరించి, భాగస్వామ్య దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలని, క్షేత్రస్థాయిలో వృద్ధి సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి జిల్లా స్థాయి జీడీపీ అంచనాలను రూపొందించాలని రాష్ట్రాలను కోరారు. ఇటీవల నియమితులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీసన్‌తో సహా ముఖ్యమంత్రులందరూ హాజరైన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో ఆయన గురువారం ప్రసంగించారు. 
 
వృద్ధుల సంరక్షణ, వృత్తి నైపుణ్యాభివృద్ధికి మరింత మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రులు కోరినట్లు నీతి ఆయోగ్ సభ్యులు తెలిపారు. “28 రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనడం ఇదే మొదటిసారి,” అని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. సమావేశానికి హాజరైన సభ్యులు మాట్లాడుతూ, ఇంధనం, తయారీ రంగాన్ని రెట్టింపు చేయడం ఈ సమావేశంలో ప్రధానాంశాలుగా ఉన్నాయని తెలిపారు.
 
పోటీ ధరలకు ఇంధనం లభ్యత, గ్రిడ్‌పై గృహాల ఆధారపడటాన్ని తగ్గించేందుకు సౌర మౌలిక సదుపాయాల విస్తరణకు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని పలువురు ముఖ్యమంత్రులు నొక్కిచెప్పారు. పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరల నడుమ సరసమైన ఇంధనం సమస్య తలెత్తింది. 
 
నీతి ఆయోగ్ వైస్ చైర్‌పర్సన్ అశోక్ కుమార్ లాహిరి మాట్లాడుతూ, “ఇంధనంపై, ఇంధన ధరలను పోటీతత్వంగా మార్చడం, నమ్మకమైన ఇంధనాన్ని అందుబాటులో ఉంచడంపై విస్తృతంగా చర్చ జరిగింది. గ్రిడ్ విద్యుత్‌పై గృహాల ఆధారపడటాన్ని తగ్గించడానికి, సబ్సిడీ సమస్యను పరిష్కరించేలా, ఇంటి పైకప్పులపై, నివాస భవనాలలో, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలలో సౌరశక్తిని విస్తరించడం గురించి కూడా పాలక మండలి సభ్యులు మాట్లాడారు” అని పేర్కొన్నారు. 
 
అధికారిక ప్రకటన ప్రకారం, ప్రధానమంత్రి మహిళా నేతృత్వంలోని అభివృద్ధిపై ఉద్ఘాటించారు. లక్షపతి దీదీల సంఖ్యను 3 కోట్ల నుండి 6 కోట్లకు పెంచేందుకు కృషి చేయాలని ఆయన రాష్ట్రాలను కోరారు. నారీ శక్తికి సురక్షితమైన, భద్రమైన వాతావరణాన్ని కల్పించాల్సిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ (ఓడిఒపి) కార్యక్రమాలపై దృష్టి సారించి, దాని చుట్టూ ఎగుమతి ఆధారిత వ్యూహాలను అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి రాష్ట్రాలను కోరారు. 
 
రక్షణ తయారీ రంగాన్ని భారతదేశం ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంటున్న అభివృద్ధి చెందుతున్న రంగంగా ఆయన గుర్తించారు. దాని వృద్ధి నుండి ఉత్పన్నమయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు విధానాలను రూపొందించుకోవాలని రాష్ట్రాలను ప్రోత్సహించారు. 
 
వికసిత్ భారత్ లక్ష్య సాధన కీలకం
 
భారతదేశ భవితకు వికసిత్ భారత్ లక్ష్య సాధన కీలకం అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఆశయ సాధనకు దేశవ్యాప్త సంఘటిత కార్యాచరణ అత్యవసరం అని పిలుపు నిచ్చారు. వికసిత్ భారత్ @ 2047 దిశలో పమ్మిళిత మానవ వనరుల కోణపు అభివృద్ది ఇతివృత్తంతో సమావేశం జరిగింది. వికసిత భారత్ నిర్మాణానికి ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, బ్లాక్, గ్రామీణ స్థాయి వరకూ సంకల్ప బలం అవసరం పేర్కొన్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత ఉన్నప్పటికీ, భారత్ అభివృద్ధి పథంలో బలంగా ముందుకు సాగుతోందని పేర్కొంటూ వికసిత్ భారత్ అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. వికసిత్ భారత్‌ లక్ష్య సాధనకు యువత, మహిళల సాధికారత ఎంతో కీలకమన్న మోదీ, దేశ ప్రగతి ప్రస్థానంలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు.
 
దేశంలోని 70 కోట్ల మంది యువజనులు ఏ దేశానికి లేని విధంగా భారత్‌కు అపార మానవ వనరులు అని విశ్లేషించారు. ప్రతి రాష్ట్రం తమ జనాభా సంఖ్య బలాన్ని , ప్రగతి దిశలో ఫలాల సాధనకు వాడుకోవాలని పిలుపు నిచ్చారు.  మానవ వనరులతో ఉజ్వల భవితకు దీక్ష వహించాల్సి ఉందని తెలిపారు. “జాతి నిర్మాణంలో రాష్ట్రాలదే కీల క బాధ్యత అవుతుంది. రేపటి తరాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు యువతకు అవకాశాల కల్పనకు పథకాలు తీసుకురావాలి. ఎంఎస్‌ఎంఇల స్థాపనకు చర్యలు తీసుకోవాలి” అని సూచించారు. 
 
భారతదేశం ఇటీవల ఎఫ్‌టిఎలపై సంతకాలు చేసిన పలు దేశాల నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులకు పాటుపడాల్సి ఉందని పిలుపు నిచ్చారు. దేశ నిర్మాణం, ప్రగతి దిశగా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆకళింపు ఉండే రాష్ట్రాలదే పై చేయి అవుతుందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడూ వెల్లువ అలవుతున్న క్రమంలో ఇప్పుడు మన ముందుకు వచ్చిన ఎఐను ఓ అవకాశంగా మలుచుకోవాలని ప్రధాని కోరారు. 
 
ప్రజానీకం రాబోయే రోజుల్లో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరం అయిన నైపుణ్యం అలవర్చుకోవాలని తెలిపారు. మనకు అందివచ్చే అవకాశాలతో పాటు మనను దెబ్బతీసే పలు సవాళ్లు కూడా ఉన్నాయని తెలిపారు. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. తలెత్తే సామాజిక సవాళ్లను తిప్పికొట్టే సామర్థం పెంపొందించేలా యువతరానికి మార్గదర్శకత్వం వహించాలని ప్రధాని పిలుపు నిచ్చారు. 
 
కమ్ముకొచ్చే ఎల్‌నినో, దీని తో వాతావరణంలో మార్పులు రేపు తలెత్తే సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రత్యేకించి క్షేత్రస్థాయిల్లో జల సంరక్షణ, పొదుపు చర్యలు అవసరం అని తెలిపారు. 
 
కీలక ప్రాజెక్టులకు అనుమతులు కోరిన రేవంత్ రెడ్డి 
 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, ప్రాంతీయ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ ఓడరేవు వరకు 12-లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు, మద్దతును వేగవంతం చేయడంలో జోక్యం చేసుకోవాలని తాను ప్రధానమంత్రిని కోరినట్లు తెలిపారు. 
 
జమ్మూ & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎక్స్ లో ఒక పోస్ట్‌లో, రాష్ట్ర హోదాను త్వరితగతిన పునరుద్ధరించడం, ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, అభివృద్ధి వేగం వంటి జమ్మూ & కాశ్మీర్‌కు సంబంధించిన కీలక సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. జమ్మూ & కాశ్మీర్ అంతటా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ఉపాధి కల్పించడానికి, మౌలిక సదుపాయాలను విస్తరించడాని, ప్రజా సంక్షేమాన్ని పెంపొందించడానికి కేంద్రం నుండి నిరంతర మద్దతు అవసరమని అబ్దుల్లా పేర్కొన్నారు.
 
ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇతర టెక్ పరిశ్రమల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఉద్యోగాల కోసం జార్ఖండ్ యువతను సిద్ధం చేయడానికి, రాష్ట్రంలో ఒక స్కిల్ యూనివర్సిటీ, ఒక ఫిన్‌టెక్ యూనివర్సిటీని స్థాపించేందుకు ఉద్దేశించిన సుమారు రూ. 800 కోట్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేంద్ర సహాయాన్ని కోరారు. ఏఐ, ఆటోమేషన్, గ్రీన్ ఎకానమీ వంటి వాటి ద్వారా చోటుచేసుకుంటున్న వేగవంతమైన సాంకేతిక మార్పులు పని స్వరూపాన్ని పునర్నిర్మిస్తున్నాయని, యువతకు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను రాష్ట్రాలు అందించాల్సిన అవసరం ఉందని సోరెన్ తెలిపారు. 
 
ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల డిమాండ్లను తీర్చడానికి జార్ఖండ్ సౌర సాంకేతికత, ఈవీ మరమ్మతులు, డ్రోన్ కార్యకలాపాలు, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ సేవలు వంటి రంగాలలో శిక్షణా కార్యక్రమాలను విస్తరిస్తోందని ఆయన తెలిపారు.