తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరసరణ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నది. ఆమెపై క్రిమినల్ కేసు వ్యవహారంలో కోర్టు నోటీసులు ఉన్నాయని లీకులు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులేనని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ పేల్చిన బాంబుకు ఏఐసీసీ కకావికలం అవుతున్నట్లు సమాచారం.
కుట్రకు మూలం ఎక్కడ? ఈ పని ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని ఢిల్లీ కాంగ్రెస్‌లో వార్‌రూమ్ చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. అంతర్గత కుట్ర వెనుక కారణాలను అన్వేషించేందుకు ఏఐసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇంటి దొంగే కుట్రదారుడని ఏఐసీసీ బలంగా నమ్ముతున్నట్టు తెలిసింది. తన ప్రభుత్వ వ్యవహారాలపై తరచూ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్న మీనాక్షి నటరాజన్ తో ముఖ్యమంత్రి సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటుండడంతో ఈ విషయమై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు భావిస్తున్నారు.
గాంధీభవన్ అడ్రస్ మీదే మీనాక్షికి కోర్టు నోటీసులు వచ్చినా, వాటిని గోప్యంగా ఎందుకు ఉంచారు? కేసు వివరాలను దాచిపెట్టడంలో ఉద్దేశం ఏమిటి? నిరుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలంగాణకు రావడం, ఇక్కడి ముఖ్యనేతలను కలువడానికి ప్రత్యేకమైన కారణాలేం ఉన్నాయి? అంటూ లోతుగా శోధిస్తున్నారు.
ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం నామినేషన్ పత్రాల్లో పోలీసు, కోర్టు కేసులు వెల్లడించాల్సి ఉంటుందనే విషయం తెలిసి కూడా, పోలీస్ క్లియరెన్స్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం ఏమిటి? తదితర పూర్తిస్థాయి వివరాలతో నివేదిక రూపొందించి, ఢిల్లీకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశించినట్టు తెలిసింది. అయితే, ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించక పోవడం గమనార్హం.
కాగా, మీనాక్షి నటరాజన్‌పై ఉన్న కేసును బయటపెట్టిన కాంగ్రెస్ కోవర్టు ఎవరు? అంటూ బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులు మీనాక్షీ నటరాజన్ అంశంపై బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నారని, అయితే తెలంగాణలో నమోదైన కేసును పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకొచ్చిందెవరు? అని ఆయన ప్రశ్నించారు. ముందు కాంగ్రెస్‌లోని కోవర్టులను పట్టుకొని పరిస్థితులు చక్కదిద్దుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఆయన హితవు పలికారు.
మరోవంక, మీనాక్షీనటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర కోణం దాగి ఉన్నదంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ బుధవారం సీసీఎస్ పోలీసులకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ‘తెలుగు స్ర్కైబ్’ యూట్యూబ్ చానల్ మీద సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన ఎంపీ చామల ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదుచేయాలని పోలీసులను కోరారు.
సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రతిష్ట, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలుగు స్ర్కైబ్ వ్యవహరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై పలు మీడియాసంస్థలు కాంగ్రెస్ నుంచే బీజేపీకి లీకులు వెళ్లాయని వార్తలు రాశాయి. అంతేకాకుండా, కాంగ్రెస్ నుంచే తమకు ఆమెపై ఉన్న కేసుల సమాచారం వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్, బీజేపీ నేత బీఎల్ సంతోష్ వంటి నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
ఇంతకీ ఏమిటా కేసు?
నారాయణపేట కాంగ్రెస్ నేతపై ఉన్న లైంగిక ఆరోపణల కేసులే మీనాక్షి మెడకు చుట్టుకున్నట్టు తెలిసింది. ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేయడంతోపాటు చంపుతానని బెదిరించిన వ్యవహారంలో నారాయణపేట జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డిపై ఒక మహిళ ఫిర్యాదు చేశారు. ఆమె కూడా కాంగ్రెస్ నాయకురాలని అంటున్నారు.
శివకుమార్‌రెడ్డి మీద 2022 మే 7న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో, 2023 జూన్ 28న బెంగళూరులోని కుబ్బన్ పోలీస్‌స్టేషన్‌లో వేధింపుల కేసులు నమోదయ్యాయి. అతడిని అరెస్టు చేయాలంటూ సదరు మహిళ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ముందస్తు బెయిల్ కోసం శివకుమార్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్‌గా నియమించింది. ఆయన మేనకోడలికి టికెట్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, శివకుమార్‌రెడ్డి ఒకే వేదిక మీద కూర్చున్న వీడియోలు సంపాదించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని సదరు మహిళ మీనాక్షి నటరాజన్ వద్దకు వెళ్ళింది. శివకుమార్‌రెడ్డిని ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పినట్టు సమాచారం. ఈ సమాధానంపై సంతృప్తి చెందని సదరు మహిళ కోర్టును ఆశ్రయించి, మీనాక్షిని కూడా తన పిటిషన్‌లో ప్రతివాదిగా చేర్చారు.
More Stories
జిల్లా జీడీపీ అంచనాలను రూపొందించాలని ప్రధాని మోదీ పిలుపు
పాక్ అదుపు తప్పిన పీఓకే .. ఆర్మీ కాల్పుల్లో వంద మందికి పైగా మృతి?
వ్యవసాయ ఉత్పత్తిపై ఎల్ నినోతీవ్ర ప్రభావం!