నగదు బదిలీకి జగన్ కు హైకోర్టులో అనుమతి

గత నాలుగు నెలలుగా కేవలం బటన్ లు మాత్రమే నొక్కుతూ వివిధ సంక్షేమ పధకాల క్రింద ప్రజలకు నగదు బదిలీ చేయకుండా దాటవేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలింగ్ సమయంలో బదిలీ చేసేందుకు వేస్తుకున్న ఎత్తుగడకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నుండి సానుకూలత లభించింది. 
 
ఇంతకు ముందు ఎప్పుడో బటన్ నొక్కిన పథకాలకు రెండు రోజుల లోపుగా నగదు బదిలీ చేయకుండా ఇప్పుడు చేయడం ఏమిటని ఎన్నికల కమిషన్ వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని హైకోర్టు కొట్టిపారవేసింది. రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా, విద్య దీవెన పథకాల కింద మంజూరు చేసిన రూ.14,165 కోట్లను లబ్దిదారులకు మంజూరు చేసేందుకు హైకోర్టు అనుమతించింది.
 
పోలింగ్ తర్వాతనే నగదు బదిలీ చేపట్టాలని ఎన్నికల కమిషన్ జారీచేసిన ఉత్తరువుపై ఒకరోజు పాటు స్టే విధిస్తు గురువారం పొద్దుపోయిన తర్వాత హైకోర్టు ఉత్తరువు జారీచేసింది. దాని ప్రకారం శుక్రవారం మాత్రం నగదు బదిలీ చేయవచ్చు. కానీ ఆ తర్వాత మూడు రోజులపాటు చేసేందుకు వీలు లేదు.
ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నిధుల విడుదల చేయవద్దని స్పష్టం చేసింది. దీంతో, ఈ ఒక్క రోజులోనే నగదు విడుదలకు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో కొన్ని షరుతులు విధించింది. ఎన్నికల కమిషన్ ఉత్తరువును సవాల్ చేస్తూ విద్యార్థులు, మహిళలు వేసిన పిటిషన్ పై సానుకూలంగా స్పందింస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు. 

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించకూడదని ఈసీకి పలు రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి. అవసరమైతే పోలింగ్ తరువాత బదిలీ చేయాలని సూచించాయి. అలాగే పోలింగ్ కు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం వల్ల ఓటర్లు ప్రలోభానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.

దీనిపై స్పందించిన ఈసీ డీబీటీ ద్వారా నిధులు విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీకి వివరణ ఇచ్చారు.గత నాలుగున్నర ఏళ్లుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నామని ఇది ఇప్పటికిప్పుడు తీసుకొచ్చిన పథకం కాదని వివరించారు. తమకు గత నాలుగున్నరేళ్లుగా అందుతున్న లబ్ధికి అడ్డుపడుతున్నారని పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన ఏపీ హైకోర్టు ఈసీకి పలు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఈసీ కోర్టుకు వివరణ ఇచ్చింది.